Stock Markets: అమెరికా సుంకాల దెబ్బ... భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Markets Crash Due to US Tariffs and Global Cues
  • 705 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 211 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • డాలరుతో రూపాయి మారకం విలువ 87.63
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు అమల్లోకి రావడంతో మదుపరుల సెంటిమెంట్ తీవ్రంగా దెబ్బతింది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు కొనసాగుతుండటం సూచీల పతనానికి దారితీసింది. ఈ అమ్మకాల సునామీలో మదుపరుల సంపద భారీగా హరించుకుపోయింది. ఒక్కరోజే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ.4 లక్షల కోట్లు తగ్గి రూ.445 లక్షల కోట్లకు పడిపోయింది.

ఈ ఉదయం 80,754 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్, రోజంతా అదే బాటలో పయనించింది. ట్రేడింగ్ మధ్యలో ఒక దశలో 80,013 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చివరికి 705 పాయింట్ల భారీ నష్టంతో 80,080 వద్ద స్థిరపడింది. మరోవైపు, నిఫ్టీ సైతం 211 పాయింట్లు కోల్పోయి 24,500 వద్ద ముగిసింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది.

సెన్సెక్స్ 30 షేర్లలో ఐటీ దిగ్గజాలైన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్‌తో పాటు పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అత్యధికంగా నష్టపోయాయి. అయితే టైటాన్, ఎల్&టీ, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ వంటి షేర్లు మాత్రం లాభాలతో గట్టెక్కాయి.

డాలరుతో రూపాయి మారకం విలువ 87.63 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ ధర 67.79 డాలర్ల వద్ద, ఔన్సు బంగారం ధర 3,397 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Stock Markets
Indian Stock Market
Sensex
Nifty
US Tariffs
Market Crash
Rupee Value
Share Market
Bombay Stock Exchange
HDFC Bank

More Telugu News