Lakshmi Siva Jyothi: బుడమేరుకు నీరు... భయపడాల్సిన అవసరం లేదన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్

Lakshmi Siva Jyothi says no need to fear Budameru floods
  • 3 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని కలెక్టర్ లక్ష్మీశ వెల్లడి
  • మున్నేరు వాగుకు వరద నీరు వచ్చినప్పటికీ ఏపీలో ఇబ్బందికర పరిస్థితి లేదన్న కలెక్టర్
  • ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
బుడమేరుతో భయపడాల్సిన అవసరం లేదని, అక్కడ వరద పరిస్థితి ఏమీ లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు. 3 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని, పరిస్థితి అంతా నియంత్రణలోనే ఉందని ఆయన తెలిపారు. ప్రజలు భయపడాల్సిన పని లేదని అన్నారు. పోతుల వాగు, నల్ల వాగు వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో వరద పరిస్థితిపై హోంమంత్రి అనిత, ఇతర ఉన్నతాధికారులు ఆరా తీశారని కలెక్టర్ తెలిపారు.

ఖమ్మం, వరంగల్‌లో కురుస్తున్న వర్షాలతో మున్నేరు వాగుకు వరద నీరు వస్తోందని, అయితే దీని వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఇబ్బందికర పరిస్థితులు లేవని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే 95 గ్రామాలపై భారం పడుతుందని అన్నారు. వారికి ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, కొండ ప్రాంతంలో ఉన్న వారు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని అన్నారు. పల్లె నుంచి వట్నం వరకు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని చెప్పారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్-ఫ్లో, ఔట్-ఫ్లో ప్రస్తుతం 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు.
Lakshmi Siva Jyothi
NTR district
Budameru river
Prakasam Barrage
Andhra Pradesh floods

More Telugu News