Kamareddy floods: కామారెడ్డి జిల్లాలో వరద బీభత్సం.. గ్రామాలకు గ్రామాలే ఖాళీ!

Telangana Kamareddy Villages Evacuated Due to Flood Havoc
  • కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో వరద ఉధృతి
  • నీట మునిగిన పలు గ్రామాలు.. ఇళ్లు ఖాళీ చేస్తున్న ప్రజలు
  • నిజాంసాగర్, కౌలాస్ నాలా గేట్లు ఎత్తడంతో మంజీరాకు పోటెత్తిన వరద
  • వందలాది కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
  • గుళ్లు, బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్న బాధితులు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని కామారెడ్డి జిల్లా విలవిల్లాడుతోంది. జిల్లాలోని ప్రధాన జలాశయాలైన నిజాంసాగర్, కౌలాస్ నాలా ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

డోంగ్లి మండలంలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సిర్పూర్, పెద్దటాక్లి, హాసన్‌ టాక్లి గ్రామాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో సిర్పూర్‌లో 246, పెద్దటాక్లిలో 190, హాసన్‌ టాక్లిలో 120 కుటుంబాలు తమ నివాసాలను ఖాళీ చేశాయి. కొందరు సమీపంలోని బంధువుల ఇళ్లకు వెళ్లగా, మరికొందరు డోంగ్లి మండల కేంద్రానికి చేరుకున్నారు. చిన్నారులు, వృద్ధులతో సహా పలువురు మద్నూర్ మండలంలోని మిర్జాపూర్ ఆంజనేయస్వామి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు, పిట్లం మండలం కుర్తి గ్రామం బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది.

ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పర్యటించారు. ఆలయాల్లో తలదాచుకుంటున్న బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితుల కోసం తక్షణమే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి కొనసాగుతుండటంతో ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Kamareddy floods
Telangana rains
Nizam Sagar project
Kowlas Nala project
Manjeera river
Dongli mandal
Tota Laxmikanth Rao
Flood relief
Telangana heavy rains
Kamareddy district

More Telugu News