Himachal Pradesh Floods: హిమాచల్‌లో జ‌ల ప్రళయం.. 300 దాటిన మృతుల సంఖ్య

Himachal Pradesh Floods Death Toll Exceeds 300
  • హిమాచల్ ప్రదేశ్‌లో వరుణుడి బీభత్సం
  • ఈ సీజన్‌లో ఇప్పటివరకు 310కి చేరిన మృతుల సంఖ్య
  • రూ.2,62,336 లక్షలకు పైగా ఆస్తి నష్టం అంచనా
  • రెండు జాతీయ రహదారులతో సహా 582 రోడ్లు మూసివేత
  • కుప్పకూలిన విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు
హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాలు సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. కుంభవృష్టి, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఈ ఏడాది జూన్ 20న వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు వివిధ ప్రమాదాల్లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (HPSDMA) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆగస్టు 27 నాటికి మృతుల సంఖ్య 310కి చేరింది. వీరిలో 158 మంది నేరుగా వర్ష సంబంధిత ప్రమాదాలైన కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, వరదల్లో కొట్టుకుపోవడం, విద్యుత్ షాక్ వంటి కారణాలతో మరణించారు. మరో 152 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. ఈ ప్రకృతి విపత్తులో సుమారు 369 మంది గాయపడగా, మరో 38 మంది ఆచూకీ గల్లంతైంది.

ఈ వర్షాల కారణంగా మండి జిల్లా అత్యంత తీవ్రంగా నష్టపోయింది. ఒక్క మండి జిల్లాలోనే 51 మరణాలు సంభవించగా, కాంగ్రాలో 49, చంబాలో 36, సిమ్లాలో 28 మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం కూడా భారీ స్థాయిలోనే ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల నష్టం విలువ మొత్తం రూ.2,62,336.38 లక్షలు దాటినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.

బుధవారం సాయంత్రం నాటికి రాష్ట్రవ్యాప్తంగా రెండు జాతీయ రహదారులతో సహా 582 రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా కులు, మండి, కాంగ్రా, సిమ్లా జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంది. కేవలం కులు జిల్లాలోనే ఎన్‌హెచ్-03, ఎన్‌హెచ్-305 మార్గాలను అధికారులు మూసివేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,155 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, 346 తాగునీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Himachal Pradesh Floods
Himachal Pradesh
Floods
Monsoon
Landslides
Rainfall
Mandi
Kangra
Shimla

More Telugu News