Lovely Professional University: అమెరికాకు పంజాబ్ యూనివర్సిటీ షాక్.. క్యాంపస్‌లో యూఎస్ బ్రాండ్స్ కోక్, పెప్సీ అమ్మకాల బంద్!

Lovely Professional University Bans Coke Pepsi Over US Tariffs
  • భారత దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా
  • ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నిరసన
  • క్యాంపస్‌లో కోక్, పెప్సీ వంటి అమెరికన్ బ్రాండ్లపై నిషేధం
  • ఇది 'స్వదేశీ 2.O' ఉద్యమం అన్న వర్సిటీ ఛాన్సలర్
అమెరికా విధించిన భారీ దిగుమతి సుంకాలకు వ్యతిరేకంగా పంజాబ్‌కు చెందిన ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ క్యాంపస్‌లో కోకా-కోలా, పెప్సీ వంటి అమెరికన్ శీతల పానీయాల అమ్మకాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష వైఖరికి నిరసనగా దీనిని 'స్వదేశీ 2.O' ఉద్యమంగా అభివర్ణించింది.

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారతీయ వస్తువులపై అమెరికా ఏకంగా 50 శాతం సుంకాలను విధించింది. పెంచిన ఈ సుంకాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ) ఈ నిరసనకు పిలుపునిచ్చింది. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ వర్సిటీలలో ఒకటైన ఎల్‌పీయూ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఈ విషయంపై వర్సిటీ ఛాన్సలర్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ స్పందించారు. అమెరికా చర్యను 'ఆర్థిక దౌర్జన్యం'గా ఆయన అభివర్ణించారు. "ఒకవైపు యూఎస్, దాని యూరోపియన్ మిత్రదేశాలు రష్యా నుంచి ఇప్పటికీ చమురు కొనుగోలు చేస్తుంటే, కేవలం భారత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం అమెరికా రెండు నాల్కల ధోరణికి నిదర్శనం. భారతదేశం ఎవరి ముందు తలవంచదు" అని ఆయన స్పష్టం చేశారు. భారత మార్కెట్ నుంచి ఏటా రూ.6.5 లక్షల కోట్ల లాభాలు పొందుతున్న అమెరికా కంపెనీలు, అదే సమయంలో భారత్‌పై ఆంక్షలు విధించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

దాదాపు 40 వేల మంది విద్యార్థులు, సిబ్బంది ఉన్న తమ క్యాంపస్‌లో ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని మిట్టల్ తెలిపారు. వర్సిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని విద్యార్థులు, అధ్యాపకులు స్వాగతించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో #Swadeshi2.0 అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. 
Lovely Professional University
LPU
Punjab University
US Tariffs
India US Trade
Coca-Cola Ban
Pepsi Ban
Swadeshi 2.0
Ashok Kumar Mittal
Import Duties

More Telugu News