Pawan Kalyan: విశాఖలో నేటి నుంచి 'సేనతో సేనాని' సమావేశాలు.. జన సైనికుల్లో జోష్

Pawan Kalyans Meeting with Janasena Party Workers in Visakhapatnam
  • పార్టీ శ్రేణులతో మూడు రోజుల పాటు మమేకం కానున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్
  • రేపు పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో పని చేసిన నేతలతో ముఖాముఖి
  • 30న సాయంత్రం ఇందిరా గాంధీ ప్రియదర్శిని స్టేడియంలో సేనతో సేనాని బహిరంగ సభ
జనసేన పార్టీ పునరుత్తేజానికి శ్రీకారం చుట్టింది. పార్టీ కార్యకర్తలతో మమేకమవుతూ భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేయడానికే జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించిన ‘సేనతో సేనాని’ సమావేశాలు ఈరోజు నుంచి విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరు కానున్నట్లు సమాచారం.

పవన్ కల్యాణ్ విశాఖలోనే మకాం వేసి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించి తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తారు. సమావేశాల్లో భాగంగా ఈ నెల 29వ తేదీ (శుక్రవారం) ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి పని చేసిన పది మందిని ఎంపిక చేసి వారితో వివిధ అంశాలపై అధినేత పవన్ కల్యాణ్ ముచ్చటిస్తారు. 

అదే రోజు రాత్రి ఉత్తరాంధ్ర ప్రాముఖ్యతను తెలియజేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మున్సిపల్‌ స్టేడియంలో, బీచ్‌రోడ్డులోని వైఎంసీఏ హాల్ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అలాగే, 30న ఇందిరా గాంధీ ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకుని ప్రసంగిస్తారు.

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన ఈ సేనతో సేనాని సమావేశాలు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. సభలో పార్టీ భవిష్యత్ లక్ష్యాలు, కూటమి పాలనపై సమీక్ష, కార్యాచరణపై పవన్ స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. జనసేన కార్యకర్తలతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయడం, వారికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా పార్టీకి పునరుజ్జీవం లభిస్తుందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్ రాజకీయాల కోసం వ్యూహాత్మక సమావేశాలుగా ఇవి ఉపయోగపడనున్నాయని వారు పేర్కొన్నారు. 
Pawan Kalyan
Janasena
Visakhapatnam
Andhra Pradesh Politics
Sainikudu
Telugu Desam Party
Political Strategy
Public Meeting
Coalition Government
AP Assembly Elections

More Telugu News