Mizoram Begging Ban Bill 2025: భిక్షాటనపై మిజోరాం ఉక్కుపాదం... అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం

Mizoram Approves Bill to Ban Begging
  • మిజోరంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ చట్టం
  • అసెంబ్లీలో 'యాచక నిషేధ బిల్లు 2025'కు ఆమోదం
  • యాచకులకు పునరావాసం కల్పించడమే లక్ష్యమన్న సీఎం
మిజోరం రాష్ట్రాన్ని యాచకులు లేని ప్రాంతంగా మార్చే దిశగా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ రూపొందించిన 'మిజోరం యాచక నిషేధ బిల్లు, 2025'ను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కేవలం నిషేధించడమే కాకుండా, యాచకులకు పునరావాసం కల్పించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న సైరంగ్-సిహ్ము రైల్వే లైన్ ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సెప్టెంబర్ 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు. కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఇతర రాష్ట్రాల నుంచి యాచకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యగా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.

ఈ కొత్త చట్టం ప్రకారం, ప్రభుత్వం ఒక రిలీఫ్ బోర్డును, ఒక రిసీవింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుంది. భిక్షాటన చేస్తూ పట్టుబడిన వారిని ఈ కేంద్రంలో తాత్కాలికంగా ఉంచి, 24 గంటల్లోగా వారి స్వస్థలాలకు లేదా వారి కుటుంబ సభ్యుల వద్దకు పంపిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన సామాజిక వ్యవస్థ, చర్చిలు, స్వచ్ఛంద సంస్థల చొరవ కారణంగా యాచకుల సంఖ్య చాలా తక్కువగా ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లాల్రిన్‌పుయ్ తెలిపారు. రాజధాని ఐజ్వాల్‌లో 30 మందికి పైగా యాచకులు ఉండగా, వీరిలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారేనని ఓ సర్వేలో తేలింది.

అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈ చట్టం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా, క్రైస్తవ విశ్వాసాలకు విరుద్ధమని ప్రతిపక్ష ఎంఎన్ఎఫ్ నేత లాల్‌చందమ రాల్టే అన్నారు. యాచకులకు సహాయం చేసే విషయంలో చర్చి, సమాజం పాత్రను మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు. దీనిపై ముఖ్యమంత్రి లాల్దుహోమా స్పందిస్తూ, యాచకులను శిక్షించడం తమ ఉద్దేశం కాదని, చర్చిలు, ఎన్జీవోల సహకారంతో వారికి పునరావాసం కల్పించి, రాష్ట్రాన్ని యాచక రహితంగా మార్చడమే తమ లక్ష్యమని వివరించారు. 
Mizoram Begging Ban Bill 2025
Mizoram
Begging Prohibition
Narendra Modi
Sairang-Sihhm Railway Line
Lalrindika Ralte
Lalduhoma
Aizawl
Social Welfare Department Mizoram

More Telugu News