Prithvi Shaw: ఆ అమ్మాయి ఎవరు?.. పృథ్వీ షా పోస్ట్‌పై అభిమానుల ఆసక్తి

Prithvi Shaw Celebrates Ganesh Chaturthi With Akriti Agarwal
  • సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌తో కలిసి పృథ్వీ షా వినాయక చవితి వేడుకలు
  • అకృతి అగర్వాల్‌తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన షా
  • ఫొటోలపై స్పందిస్తూ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నామన్న అభిమానులు
  • ఇటీవలే మహారాష్ట్ర జట్టుకు మారిన యువ క్రికెటర్
  • కొత్త జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీ
టీమిండియాలో చోటు కోల్పోయిన యువ సంచలనం, డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఓవైపు మైదానంలో పరుగుల వరద పారిస్తూ కమ్‌బ్యాక్ కోసం ప్రయత్నిస్తుండగా, మరోవైపు సోషల్ మీడియాలోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. వినాయక చవితి పండుగ సందర్భంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అకృతి అగర్వాల్‌తో కలిసి దిగిన ఫొటోలను పృథ్వీ షా పంచుకున్నాడు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట‌ వైరల్‌గా మారాయి.

పృథ్వీ షా పోస్ట్ చేసిన మూడు ఫొటోలలో రెండింటిలో అతను, అకృతి ఇద్దరూ వినాయకుడి విగ్రహం వద్ద సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు వారికి శుభాకాంక్షలు తెలుపుతుండగా, మరికొందరు క్రికెట్‌పై దృష్టి పెట్టాలని కోరారు. "త్వరగా జట్టులోకి తిరిగిరా బ్రదర్.. నీ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాం" అంటూ పలువురు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఒకప్పుడు భారత క్రికెట్ భవిష్యత్ స్టార్‌గా కీర్తించబడిన పృథ్వీ షా.. టెస్టు అరంగేట్రంలోనే శతకంతో అదరగొట్టాడు. అయితే, ఫామ్ లేమి, ఫిట్‌నెస్ సమస్యలతో కొన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే ముంబై రంజీ జట్టులో స్థానం కోల్పోయాడు. గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ అతన్ని కొనుగోలు చేయకపోవడం గమనార్హం. 2021 జులైలో చివరిసారిగా భారత జట్టుకు ఆడాడు.

కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు పృథ్వీ షా ఇటీవల ముంబై నుంచి మహారాష్ట్ర జట్టుకు మారాడు. ఈ నిర్ణయం అతనికి కలిసొచ్చినట్టే కనిపిస్తోంది. ఈ నెల‌ 19న చెన్నైలో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన బుచ్చిబాబు టోర్నమెంట్ మ్యాచ్‌లో మహారాష్ట్ర తరఫున అరంగేట్రం చేసిన షా, అద్భుత శతకంతో (141 బంతుల్లో 111) మెరిశాడు. ఈ ప్రదర్శనతో అతను మళ్లీ ఫామ్ అందుకున్నాడని, త్వరలోనే టీమిండియాలోకి పునరాగమనం చేస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Prithvi Shaw
Prithvi Shaw Akruti Agarwal
Prithvi Shaw comeback
Indian Cricket
Mumbai Cricket
Buchi Babu Tournament
Maharashtra Cricket
Cricket News
Social Media Influencer

More Telugu News