KTR: భారీ వర్షాలతో తెలంగాణ నీట మునుగుతుంటే... సీఎం తీరిగ్గా బీహార్ యాత్ర చేస్తున్నాడు: కేటీఆర్

KTR Slams CM Revanth Reddy for Bihar Trip Amid Telangana Floods
  • తెలంగాణను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదలు
  • సీఎం రేవంత్ రెడ్డి బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారంటూ కేటీఆర్ విమర్శలు
  • ప్రజల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం
  • అధిష్ఠానం మెప్పు కోసమే సీఎం పర్యటనలని ఆరోపణ
  • వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్
తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్‌లో రాజకీయ యాత్రలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సహాయం కోసం ఎదురుచూస్తుంటే, సీఎం, మంత్రులు మాత్రం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని ఆరోపించారు. 

"భారీ వర్షాలతో తెలంగాణ నీట మునుగుతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు సాయం కోసం అర్థిస్తున్నారు. సీఎం మాత్రం తీరిగ్గా బీహార్ లో ఎన్నికల యాత్ర చేస్తున్నాడు. ఎప్పుడొస్తాయో తెలియని బీహార్ ఎన్నికల కోసం, తెలంగాణకు సంబంధమే లేని బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ సీఎం, మంత్రివర్గం కాంగ్రెస్ అధిష్ఠానం ముందు మోకరిల్లింది. అధిష్ఠానం ఆశీస్సులతో... పదవులు కాపాడుకుని ఖజానా కొల్లగొట్టే ధ్యాస తప్పితే ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలు గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు. 

వరదలతో ప్రజలు, యూరియా దొరక్క రైతులు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు, ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. చాలా చోట్ల వరదనీటిలో మునిగి ప్రజలు హెలికాప్టర్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో ప్రైవేట్ జెట్లలో ఊరేగుతున్న కాంగ్రెస్ సీఎం, మంత్రులకు... ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్ ల కన్నా అధ్వాన్నంగా 100 కిలోమీటర్ల లోపు ప్రభుత్వ కార్యక్రమాలకు హెలికాప్టర్ ను వినియోగిస్తున్న ఈ నేతలకు ఇప్పుడైనా హెలికాప్టర్ పంపి ప్రజల ప్రాణాలు రక్షించే తీరిక ఉందో, లేదో? 

కాంగ్రెస్ నేతలారా ఓట్లు కాదు... ప్రజల పాట్లు చూడండి. ఎన్నికలు కాదు... ఎరువుల కోసం రైతుల వెతలు చూడండి. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది" అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. 
KTR
K Taraka Rama Rao
Telangana floods
Revanth Reddy
Bihar election campaign
Telangana government
Congress party
Telangana rains
BRS party
Telangana farmers

More Telugu News