Ponnam Prabhakar: దొంగ ఓట్లతో గెలవలేదని నిరూపించుకోండి: బండి సంజయ్‌కు మంత్రి పొన్నం సవాల్

Ponnam Prabhakar Challenges Bandi Sanjay to Prove Victory Without Fake Votes
  • దొంగ ఓట్లతో గెలవలేదని భావిస్తే విచారణ కోరాలని బండి సంజయ్‌కు పొన్నం సవాల్
  • కరీంనగర్‌లో ఒకే ఇంట్లో 40 దొంగ ఓట్లు బయటపడ్డాయని వెల్లడి
  • మతం పేరుతో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపణ
తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతోనే గెలిచారన్న ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాను నిజాయతీగా గెలిచానని భావిస్తే, తన నియోజకవర్గంలో ఓట్ల సరళిపై విచారణ జరపాలని ఎన్నికల కమిషన్‌ను కోరాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. దొంగ ఓట్లపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అనుమానం వ్యక్తం చేస్తే బండి సంజయ్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన పొన్నం, ఇటీవల కరీంనగర్‌లోని ఒకే ఇంట్లో 40 ఓట్లు బయటపడ్డాయని, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి బీజేపీ కుట్రలను బయటపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.

ఓట్ల కోసమే బీజేపీ దేవుడి పేరును, అక్షింతలను వాడుకుందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బండి సంజయ్‌ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పుడు, ఒక బీసీ నేతకు అన్యాయం జరిగిందని తాము ఆయనకు మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు అదే బీజేపీ, మతం పేరు చెప్పి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును అడ్డుకోవడం దారుణమని ధ్వజమెత్తారు. "వెనుకబడిన ముస్లింలకు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దూదేకుల పేరుతో తెలంగాణ బీసీలకు అన్యాయం చేస్తే ఎలా?" అని బండి సంజయ్‌ను నిలదీశారు. కేంద్రం బీసీ బిల్లుపై నిర్ణయం తీసుకోకపోవడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని స్పష్టం చేశారు.

బీసీ రిజర్వేషన్ల బిల్లులో మతపరమైన అంశాలు లేవని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకరే స్వయంగా చెప్పారని పొన్నం గుర్తు చేశారు. ఈ బిల్లుకు ఆమోదం లభించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన బాధ్యత ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్‌లపై ఉందని అన్నారు. మరోవైపు, బీసీలకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్న ఆర్. కృష్ణయ్య ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా పొన్నం విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నగరానికి కేంద్రం నుంచి ఆయన ఒక్క రూపాయి అయినా నిధులు తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. మెట్రో విస్తరణకు అనుమతులు ఎందుకు తేలేకపోయారని నిలదీశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ హైదరాబాద్‌కు చుక్క నీరు కూడా అదనంగా తీసుకురాలేదని విమర్శించారు. 
Ponnam Prabhakar
Telangana politics
Bandi Sanjay
BJP allegations
Fake votes
BC reservations
Kishan Reddy
Telangana elections
Karimnagar
Revanth Reddy

More Telugu News