Raja Singh: తెలంగాణలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది.. కిషన్ రెడ్డి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు: రాజాసింగ్

Raja Singh Alleges Harassment by Kishan Reddy in BJP Telangana
  • తనతో 11 ఏళ్లు బీజేపీ నేతలు ఫుట్‌బాల్ ఆడుకున్నారన్న రాజాసింగ్
  • త్వరలో మరికొందరు నేతలు పార్టీకి ఫుట్‌బాల్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయమని వ్యాఖ్య
  • తమకు సొంత నాయకులతోనే పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన
బీజేపీకి ఇటీవల రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్, తాజాగా ఆ పార్టీ నాయకత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. గత 11 ఏళ్లుగా తనతో సొంత పార్టీ నేతలే 'ఫుట్‌బాల్' ఆడుకున్నారని, తనను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ అగ్రనాయకత్వానికి ఫుట్‌బాల్‌ను బహుమతిగా పంపిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. భారీ మెజారిటీతో గెలిచిన ఒక ఎంపీ ఎంతగా మనస్తాపానికి గురైతే అలాంటి పని చేస్తారని రాజాసింగ్ ప్రశ్నించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇదే తరహాలో ఫుట్‌బాల్‌ గిఫ్ట్‌లు ఇవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. పార్లమెంటులో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కూడా సొంత పార్టీ వారే డిస్టర్బ్ చేస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. "నా అసెంబ్లీ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి తన మనుషులను పెట్టి నన్ను ఇబ్బంది పెట్టారు. నా ఏరియాలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఆయనకు ఏముంది?" అని నిలదీశారు. ఈ విషయంపై బీజేపీ జాతీయ నాయకత్వం వెంటనే సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ బీజేపీలో పరిస్థితి దారుణంగా ఉందని, తమకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో కాకుండా సొంత నాయకులతోనే పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందని రాజాసింగ్ అన్నారు. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడంపై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేస్తున్న ప్రకటనలను ప్రస్తావిస్తూ, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. "బయటి నుంచి నేతలను తెచ్చుకునే బదులు, ఉన్న కార్యకర్తలకు నిధులు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకుంటే మంచి నాయకులు తయారవుతారు కదా? బీజేపీ కార్యకర్తలు ఎప్పటికీ లేబర్లుగానే పనిచేస్తూ బతకాలా?" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
Raja Singh
BJP Telangana
Kishan Reddy
Konda Vishweshwar Reddy
Telangana Politics
BJP Leaders
Internal Conflicts
Party Workers
Ramachandra Rao
Telangana Elections

More Telugu News