Prasad Additional SP: నెల రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసిన అడిషనల్ ఎస్పీ ప్రసాద్

Prasad Additional SP Dies After Month Long Battle
  • గత నెలలో చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  • ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు డీఎస్పీలు
  • హైదరాబాద్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏఎస్పీ ప్రసాద్ మృతి
గత నెలలో చౌటుప్పల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన అడిషనల్ ఎస్పీ ప్రసాద్, నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఈరోజు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ప్రమాదంలో అప్పటికే ఇద్దరు డీఎస్పీలు మరణించగా, తాజాగా ఏఎస్పీ ప్రసాద్ మృతితో విషాదం మరింత తీవ్రమైంది.

వివరాల్లోకి వెళ్తే, గత నెల 26న ఏపీకి చెందిన పోలీసు అధికారులు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా, వాహనం అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. అదే సమయంలో రోడ్డుకు అవతలి వైపుకు ఎగిరిపడగా, ఎదురుగా వస్తున్న లారీ దానిని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కార్పియో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.

ఈ తీవ్రమైన ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు చక్రధరరావు, శాంతరావు ప్రాణాలు కోల్పోయారు. ఏఎస్పీ ప్రసాద్‌కు మాత్రం తీవ్ర గాయాలు కావడంతో, ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నప్పటికీ, ఫలితం లేకపోయింది. నెల రోజుల సుదీర్ఘ చికిత్స అనంతరం ఆయన కన్నుమూశారు. ఈ ఘటనతో పోలీసు శాఖలో తీవ్ర విషాదం నెలకొంది.
Prasad Additional SP
Andhra Pradesh Police
Road Accident
Choutuppal Accident
Kamieneni Hospital
LB Nagar Hyderabad
DSP Chakradhara Rao
DSP Shantharao
Police Accident
AP Police

More Telugu News