Telangana High Court: ఆ స్థలాన్ని ఖాళీ చేయండి.. బోర్డులు తీసేయండి.. హైడ్రాకు హైకోర్టు ఆదేశం

HYDRA faces Telangana High Court rebuke over Jubilee Enclave demolitions
  • జూబ్లీ ఎన్‌క్లేవ్‌ కూల్చివేతలపై హైడ్రాకు ఎదురుదెబ్బ
  • స్వాధీనం చేసుకున్న స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశం
  • ప్రాథమికంగా అది ప్రైవేటు స్థలమని తేల్చిన హైకోర్టు
  • నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని కోర్టుకెక్కిన యజమానులు
  • తదుపరి ఉత్తర్వుల వరకు జోక్యం చేసుకోవద్దని స్పష్టీకరణ
మాదాపూర్‌లోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ప్రైవేటు స్థలంలోకి ప్రవేశించి, నిర్మాణాలను కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని హైడ్రాను ఆదేశిస్తూ నిన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

మాదాపూర్‌లోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో సర్వే నంబర్లు 66, 67లో ఉన్న 2000 చదరపు గజాల స్థలం పార్కుకు చెందినదని, దానిని కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని జూబ్లీ ఎన్‌క్లేవ్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా హైడ్రా అధికారులు ఈ నెల 23న రంగంలోకి దిగి, అక్కడి నిర్మాణాలను కూల్చివేసి, స్థలం చుట్టూ కంచె వేశారు. అంతేకాకుండా, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.

అయితే, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా ఈ కూల్చివేతలు చేపట్టారని ఆరోపిస్తూ స్థల యజమానులు వెంకటరెడ్డి, జగాల్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, హైడ్రా చర్యలను తప్పుబట్టింది. ప్రాథమికంగా రికార్డులను పరిశీలిస్తే ఆ స్థలం ప్రైవేటు వ్యక్తులదేనని స్పష్టమవుతోందని అభిప్రాయపడింది.

వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేసి, ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు హైడ్రాతో పాటు జీహెచ్‌ఎంసీ, పురపాలక శాఖ, జూబ్లీ ఎన్‌క్లేవ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ కూడా ఆ స్థలంలో ఎలాంటి జోక్యం చేసుకోరాదని పేర్కొంది.  
Telangana High Court
Jubilee Enclave
Hyderabad
HYDRA
GHMC
land dispute
court orders
encroachment
Venkata Reddy
Jagal Reddy

More Telugu News