Cancer: కబళిస్తున్న క్యాన్సర్.. భారత్‌లో గతేడాది 8.74 లక్షల క్యాన్సర్ మరణాలు!

Cancer Deaths in India 874 Lakhs Last Year
  • దేశంలో ప్రమాదకరంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు
  • 2024లో 15.6 లక్షల కొత్త కేసులు
  • పురుషుల్లో నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్
  • మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అధికం
  • 30-40 ఏళ్ల వయసు వారిలోనూ పెరుగుతున్న క్యాన్సర్ వ్యాప్తి
  • జీవనశైలి మార్పులతోనే నివారణ సాధ్యమంటున్న నిపుణులు
దేశంలో క్యాన్సర్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గతంలో వృద్ధాప్యంలో వచ్చే జబ్బుగా భావించిన క్యాన్సర్ ఇప్పుడు 30-40 ఏళ్ల వయసు వారిని కూడా వెంటాడుతోంది. గతేడాది(2024) దేశవ్యాప్తంగా ఏకంగా 15.6 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని, 8.74 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన తాజా అధ్యయనం తెలిపింది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2045 నాటికి ఏటా నమోదయ్యే కేసుల సంఖ్య 24.6 లక్షలకు చేరవచ్చని అంచనా వేసింది.

ప్రఖ్యాత జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (జామా)లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం దేశంలో క్యాన్సర్ వ్యాప్తి తీరు ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా పురుషులు, మహిళల్లో వేర్వేరు రకాల క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పురుషుల్లో నోటి, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ క్యాన్సర్లు అధికంగా ఉండగా.. ఒక్క నోటి క్యాన్సర్ కేసులే 1.13 లక్షలకు పైగా నమోదైనట్టు తెలిపింది. మహిళలను రొమ్ము, గర్భాశయ ముఖద్వార, అండాశయ క్యాన్సర్లు వేధిస్తున్నాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ కేసులు 2.38 లక్షలు నమోదైనట్టు నివేదిక వివరించింది.

ఒకప్పుడు వయసు పైబడిన మహిళల్లో కనిపించే రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు యువతుల్లో కూడా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న జీవనశైలి దీనికి ప్రధాన కారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పొగాకు నమలడం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు నోటి క్యాన్సర్లకు దారితీస్తుండగా.. మారిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటివి యువతుల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయి. దేశంలో మిజోరాం, ఢిల్లీ, ఐజ్వాల్, శ్రీనగర్ వంటి ప్రాంతాల్లో క్యాన్సర్ రేట్లు జాతీయ సగటు కంటే అధికంగా ఉన్నాయని ఈ అధ్యయనం గుర్తించింది.

క్యాన్సర్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. 30 ఏళ్లు దాటిన వారికి రెగ్యులర్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రోత్సహిస్తోంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కో కుటుంబానికి చికిత్స కోసం రూ. 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది. జన్ ఔషధి కేంద్రాలు, అమృత్ ఫార్మసీల ద్వారా తక్కువ ధరకే మందులు అందుబాటులోకి తెచ్చింది. 2026 నాటికి 200 జిల్లా క్యాన్సర్ డే-కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అయితే, చికిత్స కన్నా నివారణే ఉత్తమ మార్గమని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. పొగాకు, ధూమపానానికి దూరంగా ఉండటం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, వేపుళ్లు, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించి పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, మహిళలు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌లు, పురుషులు నోటి, ఊపిరితిత్తుల పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
Cancer
Cancer deaths India
ICMR
Indian Council of Medical Research
Cancer cases India
Breast cancer
Oral cancer
Cancer prevention
Ayushman Bharat
Cancer screening

More Telugu News