Hyderabad Rain: హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం.. నేడు ఆరెంజ్ అలర్ట్.. గణేశ్ ఉత్సవాలకు తీవ్ర ఆటంకం

Telangana Rains Hyderabad on Orange Alert
  • అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు
  • హైదరాబాద్ సహా 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
  • పలుచోట్ల పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
  • జలమయమైన లోతట్టు ప్రాంతాలు, జనజీవనానికి అంతరాయం
  • తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు
అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు రాష్ట్రం తడిసిముద్దయింది. ఈ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జన జీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా, వినాయక చవితి వేడుకలకు ఈ వానలు ఆటంకంగా మారాయి.

హైదరాబాద్ లో కూడా రాత్రి నుంచి వర్షం దంచికొడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

హనుమకొండ, వరంగల్‌, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్‌, ములుగు, సిరిసిల్ల, జనగాం, మెదక్‌, వనపర్తి, కామారెడ్డి, నిర్మల్‌, నారాయణపేట్‌ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న వెల్లడించారు.

హైదరాబాద్ నగరానికి కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రాత్రి నుంచి నగరంలో నిరంతరాయంగా వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. "ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు" అని డాక్టర్ నాగరత్న సూచించారు. రేపు, ఎల్లుండి కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఆమె తెలిపారు. 
Hyderabad Rain
Telangana Rains
Orange Alert
Ganesh Chaturthi
Heavy Rainfall
Weather Forecast
Hyderabad Weather
IMD
Low Pressure

More Telugu News