A. Ravi Krishna: ఫ్యాక్షన్ గ్రామం కప్పట్రాళ్లలో కొత్త శకం.. ఐపీఎస్ చొరవతో 8 మందికి టీచర్ ఉద్యోగాలు!

Kappatralla Village Sees New Era Thanks to IPS Officer Ravi Krishna
  • తాజా డీఎస్సీలో కప్పట్రాళ్ల గ్రామం నుంచి 8 మంది యువత ఎంపిక
  • గ్రామాన్ని దత్తత తీసుకున్న ఐపీఎస్ రవికృష్ణ ప్రత్యేక శిక్షణ
  • ఏడాది పాటు వాట్సాప్‌, జూమ్‌ ద్వారా అభ్యర్థులకు మార్గనిర్దేశం
  • ఆ అధికారి చొరవతో గ్రామంలో సమూల మార్పులు
ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలతో నిత్యం వార్తల్లో నిలిచిన రాయలసీమలోని ఓ పల్లె ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించింది. కత్తులు, వేటకొడవళ్ల స్థానంలో పుస్తకాలు పట్టి ఆ ఊరి యువత విజయకేతనం ఎగురవేసింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల గ్రామం నుంచి ఏకంగా 8 మంది యువతీయువకులు తాజా డీఎస్సీ-2025లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఒక ఐపీఎస్ అధికారి పదేళ్ల క్రితం నాటిన మార్పు అనే బీజం, నేడు ఫలవంతమై ఆ గ్రామానికే కొత్త గుర్తింపును తెచ్చిపెట్టింది.

ఐపీఎస్ రవికృష్ణ మార్గనిర్దేశం
ప్రస్తుత ఈగల్ చీఫ్, ఒకప్పటి కర్నూలు ఎస్పీ ఆకే రవికృష్ణ 2015లో కప్పట్రాళ్ల గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. కేవలం రోడ్లు, భవనాలు నిర్మిస్తే మార్పు రాదని, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని ఆయన బలంగా నమ్మారు. యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా, ఇటీవల ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించగానే గ్రామంలో డీఈడీ పూర్తి చేసిన 15 మందిని గుర్తించారు.

వారందరితో ‘డీఎస్సీ-2025’ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, తానే స్వయంగా మార్గనిర్దేశం చేశారు. ఏడాదికి పైగా క్రమం తప్పకుండా అభ్యర్థులతో మాట్లాడుతూ, ప్రతి 15 రోజులకోసారి జూమ్ ద్వారా సమావేశాలు నిర్వహించారు. తాను సివిల్స్‌కు ఎలా సన్నద్ధమయ్యారో వివరిస్తూ, వారికి ప్రణాళికలు అందించి ప్రోత్సహించారు. ఆయన నిరంతర పర్యవేక్షణ, ప్రేరణ ఫలితంగా 8 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో చదివిన నిరుపేద కుటుంబాలకు చెందినవారే కావడం విశేషం.

దత్తతతో మారిన దశ
రవికృష్ణ కప్పట్రాళ్లను దత్తత తీసుకున్నప్పటి నుంచి గ్రామంలో ప్రగతి పరుగులు పెట్టింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సహకారంతో రూ. 40 లక్షలతో ‘స్త్రీ శక్తి’ భవనాన్ని, దాతల సహాయంతో కల్యాణ మండపం, రైతు భవనాలు నిర్మించారు. ‘సేవ్ ట్రీస్’ సంస్థ ద్వారా రైతులకు 60 వేల పండ్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత అందించి వారి అభివృద్ధికి బాటలు వేశారు. ఆయన భార్య పార్వతీదేవి సైతం ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ మహిళలకు అండగా నిలుస్తున్నారు.

ఉద్యోగాలు సాధించిన యువత తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. "రవికృష్ణ సార్ ఇచ్చిన ప్రోత్సాహం, ప్రణాళిక వల్లే మేం ఈ విజయం సాధించాం. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన మాలాంటి వాళ్లు ప్రభుత్వ టీచర్లు అవుతున్నామంటే దానికి ఆయనే కారణం" అని ఎంపికైన అభ్యర్థులు శ్రీరాములు, రాజేశ్వరి, ఉత్తేజ్‌ గౌడ్‌ వంటి వారు తెలిపారు. ఒకప్పుడు వలస కూలీలుగా ఉన్న తమ తల్లిదండ్రుల కళ్లల్లో ఇప్పుడు ఆనందం చూస్తున్నామని మరికొందరు భావోద్వేగంతో అన్నారు. రవికృష్ణ కృషి కప్పట్రాళ్ల ముఖచిత్రాన్నే మార్చేసి, ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.
A. Ravi Krishna
Kappatralla
faction village
IPS officer
teacher jobs
DSC 2025
Kurnool district
Andhra Pradesh education
rural development
Rayalaseema

More Telugu News