Chandrababu Naidu: ఏపీఎస్ఆర్టీసీలో పదోన్నతులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Chandrababu green signal for APSRTC employee promotions
  • డ్రైవర్లు, కండక్టర్లు సహా 3,000 మందికి లబ్ధి
  • సిబ్బంది చిరకాల కోరిక నెరవేర్చిన ప్రభుత్వం
  • సీఎం, రవాణా మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఉద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరింది. ఎంతోకాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించిన దస్త్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సంస్థలో పనిచేస్తున్న దాదాపు 3,000 మంది అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు లభించనున్నాయి.

ఈ నిర్ణయంతో డ్రైవర్లు, కండక్టర్ల నుంచి మొదలుకొని గ్యారేజీ సిబ్బంది, సూపర్‌వైజర్ల వరకు వివిధ కేడర్లలో అర్హులైన సిబ్బందికి ప్రయోజనం చేకూరనుంది. చాలా ఏళ్లుగా పదోన్నతులు లేక ఒకే హోదాలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశమని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ నిర్ణయం తమ కుటుంబాల్లో సంతోషాన్ని నింపిందని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పదోన్నతులకు పచ్చజెండా ఊపడంపై ఉద్యోగ సంఘాల నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ), ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 
Chandrababu Naidu
APSRTC
APSRTC promotions
Andhra Pradesh
Road Transport Corporation
Employees Union
NMU
Mandapalli Ramprasad Reddy
AP transport
Government jobs

More Telugu News