BR Naidu: పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి.. జగన్‌పై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు

TTD Chairman BR Naidu Accuses Jagan of Point Blank Threat
  • ముంతాజ్ హోటల్ కు భూముల విషయంలో జగన్ బెదిరించారన్న బీఆర్ నాయుడు
  • టీటీడీని వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపణ
  • భూమనను తిరుపతి నుంచి తరిమికొట్టాలని వ్యాఖ్య
వైసీపీ అధినేత జగన్ పై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ముంతాజ్ హోటల్‌కు భూముల విషయంలో అజయ్ అనే వ్యక్తికి జగనే స్వయంగా పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తుపాకి పెట్టి బెదిరించారని ఆయన ధ్వజమెత్తారు. తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ముంతాజ్ హోటల్ వ్యవహారంపై మాట్లాడుతూ, తిరుమల ఏడుకొండలను ఆనుకొని ఉన్న పవిత్రమైన ప్రాంతాన్ని ముంతాజ్ హోటల్‌కు కేటాయించడం గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదమని విమర్శించారు. కోట్లాది రూపాయల టీటీడీ నిధులను వైసీపీ నేతలు మింగేశారని ఆరోపించారు. తమ బోర్డు అధికారంలోకి వచ్చాక అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా పనిచేస్తోందని, టీటీడీ పవిత్రతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

ముంతాజ్ హోటల్ వివాదాన్ని పరిష్కరించడంలో సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషించారని బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా హోటల్ నిర్మాణం సరికాదని చంద్రబాబు చెప్పారని, హోటల్ యాజమాన్యంతో మాట్లాడి వారికి మరోచోట 25 ఎకరాల స్థలం తీసుకునేలా ఒప్పించారని వివరించారు. టీటీడీ భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారని కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు.

ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేయడాన్ని ఆయన హాస్యాస్పదంగా అభివర్ణించారు. డబ్బు వెదజల్లి అందరినీ కొనడం వారికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ఇదే క్రమంలో, మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డిపై కూడా నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో నివసించే అర్హత భూమనకు లేదని, ఆయన్ను తిరుపతి నుంచి తరిమికొట్టాలని అన్నారు.
BR Naidu
TTD Chairman
Jagan Mohan Reddy
Mumtaz Hotel
Tirupati
Chandrababu Naidu
TTD Funds
Bhumana Karunakar Reddy
Andhra Pradesh Politics
YSRCP

More Telugu News