Telangana Rains: తెలంగాణకు హెచ్చరిక... నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Heavy Rainfall Alert Issued for Telangana Next Four Days
  • బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
  • నేడు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • రేపు ఏడు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక
  • అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు
తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. కొన్ని జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ఈ ఉదయం వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఇది రానున్న రెండ్రోజుల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో మంగళ, బుధవారాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని అంచనా వేశారు.

వాతావరణ శాఖ సూచనల ప్రకారం, ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇక రేపు ఖమ్మం, కొమురంభీం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది. వీటితో పాటు ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తన నివేదికలో స్పష్టం చేసింది.
Telangana Rains
Telangana Weather
IMD
Heavy Rainfall Alert
Hyderabad Rains
Monsoon 2024
Bhupalpally
Mulugu
Weather Forecast

More Telugu News