RTC Bus: మెహిదీపట్నంలో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. ఇదిగో వీడియో!

RTC Bus Catches Fire in Mehdipatnam Hyderabad
  • లింగంపల్లి నుంచి వస్తుండగా బస్టాండ్ వద్ద ఆగిపోయిన బస్సు
  • స్టార్ట్ కాకపోవడంతో ప్రయాణికులను దించేసిన డ్రైవర్
  • బాగుచేసే ప్రయత్నంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
  • డ్రైవర్ అప్రమత్తతతో త‌ప్పిన ప్ర‌మాదం.. బస్సు ముందు భాగం పూర్తిగా దగ్ధం
నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన మెహిదీపట్నంలో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణికులతో వెళుతున్న ఓ ఆర్టీసీ సిటీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి తీవ్ర కలకలం సృష్టించాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

వివరాల్లోకి వెళితే.. మెహిదీపట్నం డిపోకు చెందిన సిటీ బస్సు లింగంపల్లి నుంచి ప్రయాణికులతో మెహిదీపట్నం బయలుదేరింది. బస్టాండ్ సమీపంలోకి రాగానే బస్సులో సాంకేతిక సమస్య తలెత్తి రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది. డ్రైవర్ బస్సును తిరిగి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, ప్రయాణికులందరినీ వెంటనే బస్సు నుంచి కిందకు దించేశాడు.

అనంతరం, సమస్యను పరిశీలించేందుకు డ్రైవర్ బానెట్‌ను తెరిచి వైర్లను సరిచేస్తుండగా ఒక్కసారిగా ఇంజిన్‌లోంచి దట్టమైన పొగతో పాటు మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు బస్సు ముందు భాగానికి వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, వారు వచ్చేసరికే బస్సు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రయాణికులు కిందకు దిగిన తర్వాత మంటలు చెలరేగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
RTC Bus
Mehdipatnam
Hyderabad
Bus Fire Accident
Short Circuit
Fire Department
Lingampally
Traffic Disruption
Telangana RTC
Public Transportation

More Telugu News