Jasmin Jaffar: బిగ్ బాస్ కంటెస్టెంట్ చేసిన పనికి.. కేరళ గురువాయూర్ ఆలయంలో తీవ్ర వివాదం

Influencers Reel At Guruvayur Temple Triggers Storm Purification Drive
  • పవిత్ర కోనేటిలో కాళ్లు పెట్టి వీడియో చిత్రీకరించిన ఇన్ ఫ్లుయెన్సర్
  • ఆలయంలో ఆరు రోజుల పాటు సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు
  • భక్తుల దర్శనాలపై తాత్కాలిక ఆంక్షలు విధించిన దేవస్వం బోర్డు
  • ఇన్ ఫ్లుయెన్సర్ జాస్మిన్ పై పోలీసులకు ఫిర్యాదు
  • తెలియక చేశానంటూ క్షమాపణలు చెప్పిన జాస్మిన్
సోషల్ మీడియాలో పాప్యులారిటీ కోసం చేసే కొన్ని పనులు తీవ్ర వివాదాలకు దారి తీస్తున్నాయి. తాజాగా కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో ఓ ఇన్ ఫ్లుయెన్సర్ చేసిన పని పెద్ద దుమారం రేపింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం ఆమె పవిత్ర ఆలయ కోనేటిలో కాళ్లు పెట్టడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆలయ అధికారులు ఆరు రోజుల పాటు ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

అస‌లేం జ‌రిగిందంటే..?
మలయాళం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ఇన్ ఫ్లుయెన్సర్ అయిన జాస్మిన్ జాఫర్ ఇటీవల గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని పవిత్ర కోనేటిలో కాళ్లు పెట్టి నీళ్లలో ఆడుతున్నట్లుగా ఒక వీడియో చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో భక్తులు, పలు హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆలయ సంప్రదాయాలను ఉల్లంఘించి, మతపరమైన మనోభావాలను కించపరిచారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివాదం తీవ్రం కావడంతో గురువాయూర్ దేవస్వం బోర్డు వెంటనే రంగంలోకి దిగింది. ఆలయ పవిత్రతకు భంగం కలిగిందని భావించి, మంగళవారం నుంచి ఆరు రోజుల పాటు శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ ఆరు రోజుల్లో 18 ప్రత్యేక పూజలు, 18 శీవేలీలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ కారణంగా ఆలయంలో భక్తుల దర్శనాలపై కూడా ఆంక్షలు విధించారు.

అంతేకాకుండా ఆలయ నిబంధనలను ఉల్లంఘించినందుకు జాస్మిన్ జాఫర్‌పై దేవస్వం బోర్డు నిర్వాహకులు ఆలయ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆలయ పవిత్ర ప్రాంగణంలో ఫొటోగ్రఫీని నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఆమె అతిక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన చర్యపై తీవ్ర విమర్శలు రావడంతో జాస్మిన్ జాఫర్ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. ఆలయ సంప్రదాయాల గురించి తెలియక ఈ పొరపాటు జరిగిందని, ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశం తనకు లేదని ఆమె వివరణ ఇచ్చారు.
Jasmin Jaffar
Bigg Boss
Guruvayur Temple
Kerala
Temple Controversy
Instagram Reel
Religious Sentiments
Guruvayur Devaswom Board
Temple Rituals
Social Media Influencer

More Telugu News