Payyavula Keshav: జూనియర్ ఎన్టీఆర్ వివాదంపై పయ్యావుల కేశవ్ స్పందన

Payyavula Keshav on Junior NTR Controversy and AP Finances
  • ఎన్టీఆర్ వివాదంపై ఎమ్మెల్యే ప్రసాద్ ఇప్పటికే వివరణ ఇచ్చారన్న కేశవ్
  • ఆ అంశాన్ని కొనసాగించడం భావ్యం కాదని వ్యాఖ్య
  • కేంద్ర ప్రభుత్వం తెస్తున్న జీఎస్టీ సంస్కరణలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని వెల్లడి
స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన అభిమానులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ అంశానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలను పిలిపించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన సంగతి తెలిసిందే.

ఈ అంశంపై ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి తాను ఎక్కడా ఏమీ అనలేదని ఎమ్మెల్యే ప్రసాద్ చెప్పిన తర్వాత కూడా... ఆ అంశంపై వివాదాన్ని కొనసాగించడం భావ్యం కాదని అన్నారు. 

సామాన్యులకు మేలు చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో తీసుకురాబోయే సంస్కరణలకు తమ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ఈ సంస్కరణల వల్ల రాష్ట్రంపై కొంత ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రానికి పూర్తిగా సహకరిస్తామని ఆయన వెల్లడించారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పుడు వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని, ఈ కారణంగానే కొత్తగా రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పయ్యావుల వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 

పింఛన్ల తొలగింపుపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. అర్హతపై అనుమానం ఉన్నవారికి కేవలం నోటీసులు మాత్రమే ఇస్తామని, వారు మెడికల్ బోర్డు ద్వారా తమ అర్హతను నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని, గతంలో కంటే ఎక్కువ సరఫరా చేశామని అన్నారు. యూరియా అక్రమ రవాణా ఎక్కడైనా జరిగితే విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పోలవరం, అమరావతితో పాటు పలు నీటిపారుదల ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని పయ్యావుల హామీ ఇచ్చారు. కేవలం మూడు నెలల్లోనే రూ. 35 కోట్లతో హెచ్‌ఎల్‌సీ పనులు పూర్తి చేశామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతమైందని, దీనికి కొనసాగింపుగా అనంతపురంలో 'సూపర్ సిక్స్ – సూపర్ హిట్' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Payyavula Keshav
Junior NTR
NTR
Andhra Pradesh
TDP
Chandrababu Naidu
GST
AP Finance Minister
Anantapur
Daggubati Prasad

More Telugu News