Manideep: హైదరాబాద్ లో రేవ్ పార్టీ.. ఏపీ డిప్యూటీ తహసీల్దార్ ప్రమేయం వెలుగులోకి..!

Manideep Andhra Deputy Tahsildar Involved in Hyderabad Rave Party
  • కొండాపూర్‌లోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ భగ్నం
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, వ్యాపారులతో పాటు ఆరుగురి అరెస్ట్
  • బెంగళూరు నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడు పరారీ
  • కొకైన్, ఎకస్టీ పిల్స్, ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • గతంలోనూ డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఓ నిందితుడు
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రేవ్ పార్టీ కేసులో ప్రభుత్వ అధికారి ప్రమేయం వెలుగులోకి వచ్చింది.. కొండాపూర్‌లోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌పై పోలీసులు దాడి చేసి, డ్రగ్స్‌తో పార్టీ చేసుకుంటున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏపీకి చెందిన ఓ డిప్యూటీ తహసీల్దార్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు.

మాదాపూర్ డీసీపీ డాక్టర్ జి. వినీత్ నిన్న మీడియాకు ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, కొండాపూర్‌లోని రాజరాజేశ్వరి నిలయం సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో తెలంగాణ ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో తేజ, విక్రమ్, నీలిమ, వైన్ షాప్ యజమాని పురుషోత్తంరెడ్డి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భార్గవ్, ఇంజినీరింగ్ విద్యార్థి చందన్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 గ్రాముల కొకైన్, 20 గ్రాముల ఎకస్టీ పిల్స్, 3 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో నిందితులు సంచలన విషయాలు వెల్లడించారు. వీరంతా రాజమండ్రిలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న మణిదీప్ నిర్వహించే పార్టీలకు వెళ్లేవారని తేలింది. గత ఏడాది గోవాలో మణిదీప్ ఏర్పాటు చేసిన పార్టీలో బెంగళూరుకు చెందిన డ్రగ్స్ సరఫరాదారు రాహుల్‌తో వీరికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి రాహుల్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో పార్టీలు చేసుకుంటున్నట్లు నిందితులు అంగీకరించారు. ఇంజినీరింగ్ విద్యార్థి చందన్ ద్వారా రాహుల్ వీరికి డ్రగ్స్ పంపేవాడని పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం డ్రగ్స్ సరఫరా చేసిన రాహుల్‌తో పాటు డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్ పరారీలో ఉన్నారని, వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చామని డీసీపీ వినీత్ స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన వారిలో విక్రమ్ గతంలోనూ ఓ డ్రగ్స్ కేసులో పట్టుబడినట్లు ఆయన పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.
Manideep
Hyderabad rave party
rave party
drug bust
deputy tahsildar
Gachibowli
Kondapur
cocaine
MDMA
drugs case

More Telugu News