P Shanmugam: ప్రేమ పెళ్లిళ్లకు మా ఆఫీసులు తెరిచే ఉంటాయి.. తమిళనాడు సీపీఎం సంచలన నిర్ణయం

CPM Offices Open for Love Marriages in Tamil Nadu
      
సామాజిక సంస్కరణల దిశగా తమిళనాడు సీపీఎం ఒక కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో పెరిగిపోతున్న పరువు హత్యలకు వ్యతిరేకంగా తమ పార్టీ కార్యాలయాలను ప్రేమ వివాహాలకు వేదికగా మారుస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. కులాంతర, ఆత్మగౌరవ వివాహాలు చేసుకునే జంటలకు తమ పార్టీ కార్యాలయాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేసింది.

చెన్నైలోని మైలాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో పరువు హత్యల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఈ దురాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా పరువు హత్యలను అరికట్టేందుకు తక్షణమే ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని కోరారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాల మధ్యనే కాకుండా, కొన్నిసార్లు ఒకే సామాజికవర్గంలో కూడా పరువు హత్యలు జరుగుతున్నాయని షణ్ముగం ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రేమ జంటలకు భరోసా కల్పిస్తుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
P Shanmugam
Tamil Nadu CPM
Love Marriages
Honor Killings
Inter Caste Marriages
Social Reform
Tamil Nadu Politics
CPM Office
মাইলাপুর
Interfaith Marriage

More Telugu News