Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం.. ఎట్టకేలకు మౌనం వీడిన సచిన్!

Arjun Tendulkar Engagement Confirmed by Sachin Tendulkar
  • కొడుకు ఎంగేజ్‌మెంట్‌పై సచిన్ క్లారిటీ
  • అర్జున్ కు నిశ్చితార్థం జరిగిందని వెల్లడించిన సచిన్
  • తామంతా సంతోషంగా ఉన్నామని వెల్లడి
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థంపై గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ వార్త నిజమేనని సచిన్ స్వయంగా ధృవీకరించారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈరోజు జరిగిన 'ఆస్క్ మీ ఎనీథింగ్' సెషన్‌లో ఒక అభిమాని "అర్జున్‌కి నిజంగానే నిశ్చితార్థం జరిగిందా?" అని ప్రశ్నించారు. దీనికి సచిన్ బదులిస్తూ, "అవును, జరిగింది. అతని జీవితంలో మొదలైన ఈ కొత్త దశ పట్ల మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం" అని సమాధానమిచ్చారు. 

ఈనెల 14న అర్జున్ టెండూల్కర్‌కు, సానియా చందోక్ కు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇరు కుటుంబాల నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పుడు సచిన్ స్పందనతో ఆ వార్తలకు అధికారిక ముద్ర పడినట్లయింది.

కాబోయే కోడలు సానియా చందోక్ ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు. హాస్పిటాలిటీ, ఫుడ్ ఇండస్ట్రీలో ఘాయ్ కుటుంబానికి మంచి పేరుంది. ప్రముఖ ఇంటర్‌కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ సంస్థలు వీరివే.

ఇక అర్జున్ టెండూల్కర్, తండ్రి బాటలోనే క్రికెట్‌లో రాణిస్తున్నాడు. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన అర్జున్, దేశవాళీ క్రికెట్‌లో గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున కూడా ఆడాడు.
Arjun Tendulkar
Sachin Tendulkar
Sanvi Chadhok
Arjun Tendulkar engagement
Mumbai Indians
Goa cricket team
Indian cricket
cricket news
Ravi Ghai
InterContinental Hotel

More Telugu News