Tatikonda Rajaiah: కేసీఆర్ ను కూడా కడియం శ్రీహరి బ్లాక్ మెయిల్ చేశారు: తాటికొండ రాజయ్య

Tatikonda Rajaiah Alleges Kadiyam Srihari Blackmailed KCR
  • కూతురి ఎంపీ టికెట్ కోసమే కడియం పార్టీ మారారని రాజయ్య ఆరోపణ
  • కడియం ఒక అవినీతి తిమింగలమంటూ ఘాటు వ్యాఖ్యలు
  • విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పోస్టులు అమ్ముకున్నారని విమర్శ
  • విదేశాల్లో ఆస్తులు, బినామీ లావాదేవీలు ఉన్నాయని ఆరోపణలు
  • స్పీకర్ వెంటనే కడియం అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్
ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒక అవినీతి తిమింగలమని, ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పలేని అయోమయ స్థితిలో ఉన్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య ఎద్దవా చేశారు. కేవలం తన కుమార్తెకు ఎంపీ టికెట్ ఇప్పించుకోవడం కోసమే శ్రీహరి పార్టీ మారారని, తన రాజకీయ సమాధిని తానే నిర్మించుకున్నారని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో చేరానని స్వయంగా ప్రకటించిన కడియం శ్రీహరి, ఇప్పుడు అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. "పదిహేనేళ్ల పాటు మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు గుర్తుకురాని అభివృద్ధి, ఇప్పుడు కొత్తగా గుర్తుకువచ్చిందా?" అని రాజయ్య నిలదీశారు. స్టేషన్ ఘన్‌పూర్‌ను అభివృద్ధి చేయడం పక్కనపెట్టి, కడియం శ్రీహరి మాత్రమే అభివృద్ధి చెందారని ఆరోపించారు.

శ్రీహరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలను అమ్ముకున్నారని, కాంట్రాక్టర్ల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేశారని విమర్శించారు. అంతేకాకుండా, విదేశాల్లో ఆస్తులు కూడబెట్టారని, హైడల్ ప్రాజెక్టులను అమ్ముకున్నారని, బినామీ పేర్లతో ఆయనకు భారీగా ఆస్తులున్నాయని ఆరోపించారు. టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారుతానంటూ కేసీఆర్‌ను సైతం కడియం బ్లాక్‌మెయిల్ చేశారని రాజయ్య వ్యాఖ్యానించారు.

ఫిరాయింపుల విషయంలో స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని రాజయ్య డిమాండ్ చేశారు. "జస్టిస్ బీఆర్ గవాయ్ మూడు నెలల గడువు ఇచ్చారు. స్పీకర్ రాజ్యాంగాన్ని గౌరవించి, అంబేద్కర్ మీద గౌరవం ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు వింటే స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లే అవుతుంది" అని హెచ్చరించారు. కడియం శ్రీహరికి ప్రజలు కచ్చితంగా కర్రుకాల్చి వాత పెడతారని రాజయ్య జోస్యం చెప్పారు.

Tatikonda Rajaiah
Kadiyam Srihari
BRS
Telangana Politics
Revanth Reddy
Station Ghanpur
Congress Party
Defection
KCR
Corruption

More Telugu News