Sanjay Malhotra: అమెరికా అధిక సుంకాలపై స్పందించిన ఆర్బీఐ గవర్నర్

Sanjay Malhotra on US Tariffs Impact on Indian Economy
  • భారత్-అమెరికా వాణిజ్య చర్చలపై ఆర్బీఐ గవర్నర్ ఆశాభావం
  • అమెరికా సుంకాల ప్రభావం స్వల్పమేనని వెల్లడి
  • 11 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ నిల్వలు
భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సానుకూలంగా ముగుస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ధీమా వ్యక్తం చేశారు. అమెరికా విధిస్తున్న భారీ సుంకాల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై స్వల్పంగానే ఉంటుందని ఆయన అంచనా వేశారు. సోమవారం ముంబైలో జరిగిన వార్షిక బ్యాంకింగ్ సదస్సు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"సుంకాలపై చర్చలు ఫలవంతమవుతాయని, వాటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం" అని మల్హోత్రా తెలిపారు. ఆగస్టు 25న జరగాల్సిన ఆరో విడత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలు వాయిదా పడిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

దేశం వద్ద విదేశీ మారక నిల్వలు బలంగా ఉన్నాయని, ఎలాంటి అంతర్జాతీయ ఒడిదొడుకులనైనా తట్టుకునే స్థితిలో ఉన్నామని మల్హోత్రా స్పష్టం చేశారు. "మన వద్ద 695 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. ఇవి 11 నెలల దిగుమతులకు సరిపోతాయి. స్వాతంత్ర్య సమరయోధులు మనకు 'స్వతంత్ర భారత్' ఇస్తే, మనం ఇప్పుడు 'సమృద్ధ భారత్' కోసం పనిచేయాలి" అని ఆయన పిలుపునిచ్చారు.

అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నవాటిని అధిగమించేందుకు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. క్రెడిట్‌ను విస్తరించేందుకు అవసరమైన చర్యలను తాము పరిశీలిస్తున్నామని అన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ సైకిల్‌ను సృష్టించేందుకు వీలుగా కార్పోరేట్‌లు, బ్యాంకులు ఒక తాటిపైకి వచ్చి పని చేయాలని అన్నారు. అప్పుడు దేశాభివృద్ధి ముందుకు వెళుతుందని అన్నారు. ధరల స్థిరీకరణ, ఆర్థికవృద్ధి లక్ష్యంగా ద్రవ్య పరపతి విధానం కొనసాగుతుందని అన్నారు.
Sanjay Malhotra
RBI Governor
India US trade
US Tariffs
Indian Economy
Forex reserves
Banking sector

More Telugu News