Chandrababu Naidu: ఐఐటీ, నిట్, నీట్‌ సాధించిన గురుకుల విద్యార్ధులకు చంద్రబాబు అభినందనలు... ఒక్కొక్కరికీ రూ.1 లక్ష

Chandrababu Congratulates Gurukul Students on IIT NIT NEET Success
  • గురుకుల విద్యార్థులను అభినందించిన సీఎం చంద్రబాబు
  • ఐఐటీ, నిట్, నీట్ లలో విజేతలుగా నిలిచిన 55 మంది విద్యార్థులు
  • సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన విద్యార్థులు
  • ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు తెలియజేసిన విద్యార్థులు
  • పేదరికం నుంచి వచ్చి ప్రతిభ చూపారంటూ సీఎం ప్రశంస
ఆంధ్రప్రదేశ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటారు. ఈ ఏడాది ఐఐటీ, నిట్, నీట్ సాధించిన 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.

సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని ఈ విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన సీఎం, వారి విజయాలను కొనియాడారు. పేదరికాన్ని జయించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు.

"వజ్రం అయినా సానబెడితేనే దాని విలువ తెలుస్తుంది. అలాగే మట్టిలో మాణిక్యాలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఇటీవల సాధించిన ఫలితాలు వారి సమర్థతను రుజువు చేస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఐఐటీ-నీట్ సెంటర్లలో కోచింగ్ పొంది ఈ ఏడాది ఐఐటీ, నిట్, నీట్‌ లలో 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు సీట్లు సాధించారు. సచివాలయంలో నన్ను కలిసిన సందర్భంగా, వారు తమ సంతోషాన్ని నాతో పంచుకుంటే ఎంతో సంతృప్తి కలిగింది. ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సీట్లు పొందిన వారికి మెమొంటోతో పాటు ఒక్కొక్కరికి రూ.లక్ష ప్రోత్సాహకం అందించి అభినందించాను. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు ఉపయోగపడేలా కొత్తగా మరో 7 ఐఐటీ-నీట్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. సరైన సదుపాయాలు, శిక్షణ, సాయం అందిస్తే ప్రపంచంలో అందరితో పోటీ పడే సత్తా మన విద్యార్థులకు ఉంది. వీరి విజయం ఎంతో మందికి స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నాను" అని చంద్రబాబు వివరించారు. 

తమ విజయానికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, గురుకులాల్లో లభించిన నాణ్యమైన విద్య ఎంతగానో దోహదపడ్డాయని విద్యార్థులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని వారు పేర్కొన్నారు.
Chandrababu Naidu
IIT
NIT
NEET
Andhra Pradesh
Gurukul schools
Social Welfare
SC ST students
Education
AP CM

More Telugu News