Dream11: టీమిండియా స్పాన్సర్‌షిప్ నుంచి డ్రీమ్11 ఔట్.. అధికారికంగా ప్ర‌క‌టించిన బీసీసీఐ

Dream11 tells BCCI it will no longer sponsor Indian cricket team board officially terminates contract
  • టీమిండియా టైటిల్ స్పాన్సర్‌షిప్‌ నుంచి వైదొలగిన డ్రీమ్11
  • కొత్త ఆన్‌లైన్ గేమింగ్ చట్టం ప్రభావంతో ఈ కీలక నిర్ణయం
  • డ్రీమ్11తో బంధం ముగిసిందని ధ్రువీకరించిన బీసీసీఐ
  • భవిష్యత్తులో ఇలాంటి సంస్థలతో ఒప్పందాలు ఉండవని స్పష్టీక‌ర‌ణ‌
  • త్వరలోనే కొత్త స్పాన్సర్ కోసం టెండర్ పిలుస్తామ‌న్న బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా
ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ టోర్నమెంట్‌కు కేవలం రెండు వారాల సమయం ఉందనగా భారత క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. జట్టు టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న ప్రముఖ ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్11, బీసీసీఐతో తన ఒప్పందాన్ని అధికారికంగా రద్దు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన "ఆన్‌లైన్ గేమింగ్ (ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్) బిల్లు, 2025" కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ పరిణామంపై బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా సోమవారం స్పందించారు. కొత్త ఆన్‌లైన్ గేమింగ్ చట్టం అమల్లోకి రావడంతో డ్రీమ్11తో తమ భాగస్వామ్యాన్ని ముగిస్తున్నట్లు ఆయన ధ్రువీకరించారు. "భవిష్యత్తులో ఇలాంటి సంస్థలతో బీసీసీఐ ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా జాగ్రత్త పడుతుంది. త్వరలోనే కొత్త స్పాన్సర్ కోసం టెండర్ ప్రకటన ఇస్తాం" అని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం భారత జట్టుకు టైటిల్ స్పాన్సర్ లేకుండా పోయింది.

గతేడాది జులైలో బైజూస్ స్థానంలో డ్రీమ్11, రూ.358 కోట్ల విలువైన మూడేళ్ల ఒప్పందంతో టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా బాధ్యతలు చేపట్టింది. ప్రస్తుతం యూఏఈలో జరగనున్న ఆసియా కప్‌కు సమయం తక్కువగా ఉండటంతో, భారత జట్టుకు కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ త్వరలోనే టెండర్లను ఆహ్వానించనుంది.
Dream11
BCCI
Team India
Indian Cricket Team
Sponsorship
Online Gaming Bill 2025
Asia Cup 2024
Devajit Saikia
Byju's

More Telugu News