Ponguru Narayana: 2027 గోదావరి పుష్కరాలపై మంత్రి నారాయణ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Ponguru Narayana Reviews Godavari Pushkaralu 2027 Plans
  • మౌలిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి సారించాలన్న మంత్రి నారాయణ
  • రుడా మాస్టర్ ప్లాన్, గోదావరి పుష్కరాలపై మంత్రి నారాయణ సమీక్ష
  • పుష్కర యాత్రికులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు చేపట్టాలన్న మంత్రి నారాయణ
రాబోయే గోదావరి పుష్కరాలను (2027) దృష్టిలో ఉంచుకుని విస్తృత ప్రణాళికలు సిద్ధం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిన్న మంత్రి నారాయణ రుడా మాస్టర్ ప్లాన్, గోదావరి పుష్కరాలపై జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తో కలిసి సమీక్ష నిర్వహించారు.

పుష్కర యాత్రికులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు చేపట్టాలన్నారు. రహదారుల అభివృద్ధి, ప్రత్యేక మార్గాల ఏర్పాటు, ఘాట్ల వద్ద ఆధునిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే పీపీపీ విధానంలో హోటల్ మేనేజ్‌మెంట్, రెస్టారెంట్లు, సంబంధిత సేవల కోసం ప్రైవేట్ భాగస్వామ్యాలను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. అధికారులు ఆశావహ దృక్పథంతో సమగ్ర చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఆర్‌యూడీఏ) పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. 3,156 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంతో రుడా మాస్టర్‌ప్లాన్‌ రూపొందించవలసి ఉండగా, ప్రస్తుతం 1,005 చదరపు కిలోమీటర్లతో మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‌ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మిగిలిన ప్రాంతాలను కూడా అనుసంధానం చేస్తూ సమగ్ర మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. మాస్టర్ ప్లాన్‌పై ఉన్న అభ్యంతరాలను నోటిఫై చేయాలన్నారు. రుడా పరిధిలోని పంచాయతీలు, మునిసిపాలిటీల పరిధిలో ప్రధానంగా కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, వీధి దీపాలపై దృష్టి సారించాలని సూచించారు.

ఏ పంచాయతీ, ఏ మునిసిపాలిటీ నుంచి వచ్చే ఆదాయాన్ని కచ్చితంగా అవే పంచాయతీలు, మునిసిపాలిటీల అభివృద్ధికే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. రుడా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు భూములను గుర్తించి ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేసుకోవాలని, తద్వారా ఆయా భూములను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక సంస్థలు ఆదాయాన్ని సమకూర్చవచ్చన్నారు.

ఈ సమీక్షలో రుడా వైస్ ఛైర్మన్, జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, సెక్రటరీ ఎం.వి.ఆర్ సాయిబాబ, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ జి.వి.ఎస్.ఎన్. మూర్తి, రుడా ప్లానింగ్ ఆఫీసర్ ఎన్. శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 
Ponguru Narayana
Godavari Pushkaralu 2027
Rajahmundry
RUDA Master Plan
Andhra Pradesh Municipal Administration
Infrastructure Development
PPP Model
River Festival
East Godavari District
Tourism

More Telugu News