Ayatollah Ali Khamenei: అమెరికా ఒత్తిడికి తలొగ్గేది లేదన్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ

Ayatollah Ali Khamenei Says Iran Will Not Bow to US Pressure
  • అమెరికా ప్రణాళికలను తిప్పికొట్టేందుకు ఐక్యంగా పోరాడాలన్న అయతొల్లా ఖమేనీ 
  • ఇస్లామిక్ రిపబ్లిక్ ను లొంగదీసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందన్న ఖమేనీ
  • అమెరికాకు వ్యతిరేకంగా భాగస్వామ్య దేశాలన్నీ కలిసి పోరాటం చేయాలన్న ఖమేనీ
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరోసారి అమెరికా, ఇజ్రాయెల్‌లపై తీవ్రంగా మండిపడ్డారు. తమను లొంగదీసుకోవడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండించిన అయతొల్లా, దీనికి వ్యతిరేకంగా భాగస్వామ్య దేశాలన్నీ కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

"ఏ పరిస్థితిలోనూ అమెరికాకు తలొగ్గేది లేదు" అని ఖమేనీ స్పష్టం చేశారు. తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా చేసిన ప్రకటనలో, జూన్‌లో తమ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికాలు దాడి చేయడం తమను ప్రతీకార చర్యల వైపు నెట్టిందని పేర్కొన్నారు.

టెహ్రాన్‌ను అస్థిరపరచాలనే లక్ష్యంతోనే అమెరికా ప్రణాళిక రూపొందించిందని ఆరోపించిన ఆయన, ఇజ్రాయెల్ దాడి చేసిన మరుసటి రోజే అమెరికా ఏజెంట్లు యూరప్‌లో సమావేశమయ్యారని, ఇరాన్ పాలనపై చర్చించినట్టు తెలిపారు. అంతిమంగా అమెరికా ఆశయం ఇరాన్‌ను విధేయ దేశంగా మార్చడమేనని విమర్శించారు.

అంతర్గతంగా దేశం ఐక్యంగా నిలబడిందని, సైన్యం, ప్రభుత్వం, ప్రజలు అందరూ కలిసి శత్రువులకు గట్టి బుద్ధి చెప్పారని అన్నారు. ఇరాన్ చూపిన ధైర్యాన్ని ప్రపంచం మొత్తం చూసిందని, అనేక దేశాలకు ఇరాన్ పట్ల గౌరవం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. అంతర్గత విభేదాలను విదేశీ శక్తులు ఉపయోగించుకునే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

కాగా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలతో ఇరాన్ మంగళవారం అణు చర్చల కోసం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఖమేనీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 
Ayatollah Ali Khamenei
Iran
America
Israel
nuclear talks
US pressure
Iran supreme leader
Middle East tensions
Iran nuclear program
Tehran

More Telugu News