Nikki: స్కార్పియో, బుల్లెట్ ఇచ్చినా.. మెర్సిడెస్ కోసం ప్రాణం తీశారు!

Nikki Murdered for Mercedes Dowry in Greater Noida
  • గ్రేటర్ నోయిడాలో కట్నం కోసం మహిళ సజీవదహనం
  • కన్నకొడుకు, సోదరి చూస్తుండగానే అత్తింటివారి పైశాచికత్వం
  • కొత్తగా కొన్న మెర్సిడెస్ కారు ఇవ్వాలని డిమాండ్
  • నిందితులను ఎన్‌కౌంటర్ చేసి, ఇల్లు కూల్చేయాలని తండ్రి ఆవేదన
  • ప్రధాన నిందితుడైన భర్త విపిన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
"అమ్మ మీద ఏదో పోశారు.. చెంప మీద కొట్టారు.. ఆ తర్వాత లైటర్‌తో నిప్పంటించారు" అంటూ ఓ ఆరేళ్ల చిన్నారి చెబుతున్న మాటలు ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన ఓ ఘోరానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కట్నం కోసం కన్నకొడుకు, సోదరి చూస్తుండగానే నిక్కీ (30) అనే మహిళను ఆమె అత్తింటివారు సజీవదహనం చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

నిక్కీని ఆమె భర్త విపిన్, అత్తింటివారు కొంతకాలంగా కట్నం కోసం తీవ్రంగా వేధిస్తున్నారు. వారి వేధింపులకు తలొగ్గి నిక్కీ కుటుంబ సభ్యులు మొదట స్కార్పియో కారు, ఆ తర్వాత బుల్లెట్ మోటార్‌సైకిల్ ఇచ్చారు. అయినా వారి కక్కుర్తి తీరలేదు. ఇటీవల నిక్కీ తండ్రి కొత్తగా కొనుగోలు చేసిన మెర్సిడెస్ కారుపై వారి కన్ను పడింది. దానిని కూడా తమకే ఇవ్వాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే నిక్కీపై దాడి చేసి, జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చి, ఆమెపై కిరోసిన్ లాంటి ద్రావణం పోసి నిప్పంటించారు. ఈ దారుణమంతా ఆమె ఆరేళ్ల కుమారుడు, అదే ఇంట్లో ఉంటున్న ఆమె సోదరి కళ్ల ముందే జరిగింది. నిక్కీ సోదరి కాంచన్ మాట్లాడుతూ రూ. 36 లక్షల కట్నం ఇవ్వలేదన్న కోపంతోనే తన సోదరిని భర్త, అత్తింటివారు కలిసి హత్య చేశారని ఆరోపించారు.

ఈ ఘటనపై బాధితురాలి తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "వారు అడిగినవన్నీ ఇచ్చాం. అయినా నా కూతురిని వేధించి చంపేశారు. యోగి ప్రభుత్వంలో ఇలాంటి వారికి చోటు లేదు. నిందితులను ఎన్‌కౌంటర్ చేసి, వారి ఇంటిపై బుల్డోజర్ చర్యలు తీసుకోవాలి. లేకపోతే మేం నిరాహార దీక్షకు దిగుతాం" అని హెచ్చరించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి భర్త విపిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు అత్త, మామ, నిక్కీ సోదరి భర్తతో సహా మొత్తం నలుగురిపై కేసు నమోదు చేసి, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.
Nikki
Nikki dowry death
Greater Noida
dowry harassment
Uttar Pradesh crime
murder for dowry
Vipin arrested
Kanchan
Mercedes car dowry
crime news

More Telugu News