Vaidyalingam Muthukumar: భార్య పనిచేసే ఆసుపత్రికే రెండో భార్యను ప్రసవానికి తెచ్చాడు.. అడ్డంగా బుక్కయ్యాడు!

Singapore Mans Second Marriage Exposed at Wifes Hospital
  • సింగపూర్‌లో భారతీయుడికి ద్విభార్యత్వం కేసులో జైలు శిక్ష
  • మొదటి భార్యకు తెలియకుండా రహస్యంగా రెండో వివాహం
  • భార్య పనిచేసే ఆసుపత్రిలోనే రెండో భార్య ప్రసవం
  • అనుకోకుండా భర్తను చూసి నిలదీయడంతో గుట్టురట్టు
  • పర్మనెంట్ రెసిడెన్సీ కోసం తప్పుడు సమాచారం ఇచ్చినట్లు నిర్ధారణ
  • మూడు నెలల మూడు వారాల జైలు శిక్ష విధించిన కోర్టు
సినిమాల్లో మాత్రమే కనిపించే ఓ నాటకీయ ఘటన సింగపూర్‌లో నిజంగా జరిగింది. తన భర్తకు రెండో పెళ్లి జరిగిందన్న విషయం ఓ మహిళకు తాను పనిచేసే ఆసుపత్రిలోనే తెలిసింది. రెండో భార్య ప్రసవం కోసం భర్త అక్కడికి రావడంతో అతడి గుట్టు రట్టయింది. ఇద్దరు మహిళలను మోసం చేయడమే కాకుండా, ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టించిన ఆ భారత వ్యక్తికి స్థానిక కోర్టు జైలు శిక్ష విధించింది.

భారత దేశానికి చెందిన వైద్యలింగం ముత్తుకుమార్ (49) అనే వ్యక్తికి 2007లో ఓ సింగపూర్ మహిళతో భారత్‌లో వివాహమైంది. 2011లో భార్య దగ్గరకు సింగపూర్ వెళ్లిన అతడు, అక్కడ సల్మా బీ అబ్దుల్ రజాక్ అనే మరో సింగపూర్ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తనకు పిల్లలు కావాలని, మొదటి భార్యకు విడాకులు ఇస్తానని సల్మాను నమ్మించాడు. ముత్తుకుమార్‌కు అప్పటికే పెళ్లయిందని తెలిసినా సల్మా అతడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది.

2022 ఆగస్టులో ఇద్దరూ భారత్‌లోని నాగూర్‌లో ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం సింగపూర్ తిరిగివచ్చిన ముత్తుకుమార్, మొదటి భార్యతోనే నివసిస్తూ రహస్యంగా సల్మాను కలుస్తుండేవాడు. ఈ క్రమంలో సల్మా గర్భం దాల్చింది. 2023 సెప్టెంబర్ 14న ప్రసవం కోసం కేకే మహిళా, శిశు ఆసుపత్రిలో చేరింది. అదే ఆసుపత్రిలో ముత్తుకుమార్ మొదటి భార్య పనిచేస్తోంది.

రెండో భార్యకు బాబు పుట్టడంతో ఆసుపత్రిలోని డెలివరీ సూట్ నుంచి బయటకు వస్తున్న ముత్తుకుమార్‌ను మొదటి భార్య చూసింది. అనుమానంతో అతడిని నిలదీయగా రెండో పెళ్లి వ్యవహారం బయటపడింది. దీనికి తోడు, జూన్ 12, 2024న సింగపూర్ పర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకుంటూ తనకు వేరే వివాహాలు లేవని ముత్తుకుమార్ తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న రెండో భార్య సల్మా.. అతడి మోసం గురించి అధికారులకు ఫిర్యాదు చేసింది.

విచారణ చేపట్టిన పోలీసులు ముత్తుకుమార్‌పై ద్విభార్యత్వం, ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశారు. విచారణలో నేరం అంగీకరించడంతో, సింగపూర్ కోర్టు అతడికి మూడు నెలల మూడు వారాల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. అతడు ఇద్దరు మహిళలనూ మోసం చేశాడని, అనుకోని రీతిలో ఈ విషయం బయటపడిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
Vaidyalingam Muthukumar
Singapore
Bigamy
Singapore permanent residency
affair
KK Women's and Children's Hospital
second marriage
false information

More Telugu News