Ranil Wickremesinghe: శ్రీలంక మాజీ అధ్యక్షుడికి రిమాండ్... జైల్లో అస్వస్థత

Ranil Wickremesinghe Remanded in Funds Misuse Case Health Concerns Arise
  • ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అరెస్ట్ 
  • జైలులో అస్వస్థతకు గురైన మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే
  • కొలంబో నేషనల్ హాస్పిటల్‌కు తరలించిన అధికారులు
  • ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స
ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 2023 సెప్టెంబరులో లండన్‌లో జరిగిన తన సతీమణి స్నాతకోత్సవం కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన ప్రభుత్వ ఖర్చులతో ప్రయాణించారని ఆరోపణలు వచ్చాయి.

ఈ కేసులో కొలంబో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) ఆయనను ఈ నెల 22న అరెస్ట్ చేసి, కొలంబో ఫోర్ట్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచింది. వాదనలు విన్న కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించి, రిమాండ్ నిమిత్తం మ్యాగజైన్ జైలుకు తరలించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ముందు బెయిల్ ఇచ్చేందుకు అవసరమైన అంశాలను ఉంచడంలో న్యాయవాదులు విఫలమైనట్లు న్యాయస్థానం పేర్కొంది.

అయితే, జైల్లో ఉన్న సమయంలో విక్రమసింఘేకు బీపీ, షుగర్ స్థాయిలు పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ఆయనకు వైద్య పరీక్షల అనంతరం కొలంబో నేషనల్ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సాజిత్ ప్రేమదాస సహా పలువురు రాజకీయ పార్టీల నేతలు ఆయనను పరామర్శించారు. రాజకీయ కుట్రలో భాగంగా ఆయన్ను రిమాండ్‌కు తరలించారనే విమర్శలూ ఉన్నాయి. అయితే, ఈ కేసులో దోషిగా తేలితే, రణిల్ విక్రమసింఘేకు కనీసం ఒక సంవత్సరం నుంచి గరిష్టంగా 20 సంవత్సరాల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.

కాగా, రణిల్ విక్రమసింఘే (76) శ్రీలంక ప్రధానిగా ఐదు సార్లు బాధ్యతలు నిర్వహించారు. 2022 నుంచి 2024 వరకు అధ్యక్షుడిగా కొనసాగారు. మూడేళ్ల క్రితం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకను గట్టెక్కించిన ఘనత కూడా ఆయనకు ఉంది. అయితే గత ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. 
Ranil Wickremesinghe
Sri Lanka
Sri Lanka ex president
CID
Colombo
Mahinda Rajapaksa
Sajith Premadasa
Government funds misuse

More Telugu News