YS Sharmila: ఇది సహజంగా ఏర్పడిన కొరత కాదు... కూటమి నేతలు సృష్టిస్తున్న కృత్రిమ సంక్షోభం: షర్మిల

YS Sharmila slams AP govt over urea shortage
  • రాష్ట్రంలో యూరియా కొరత నెలకొందంటూ షర్మిల ఆరోపణలు 
  • బ్లాక్ మార్కెట్‌లో యూరియా బస్తా రూ. 500కు విక్రయిస్తున్నారని వెల్లడి
  • రాష్ట్రానికి వచ్చిన యూరియా ఏమైందని ప్రభుత్వానికి ప్రశ్న
  • రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలని విజ్ఞప్తి
రాష్ట్రంలో రైతులు తీవ్ర యూరియా కొరత ఎదుర్కొంటున్నారంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇది సహజంగా ఏర్పడిన కొరత కాదని, అధికార పార్టీ నేతలు సృష్టిస్తున్న కృత్రిమ సంక్షోభమని ఆమె ఆరోపించారు. ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల కోసం రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం రూ. 266కు అమ్మాల్సిన యూరియా బస్తాను బహిరంగ మార్కెట్‌లో రూ. 500కు అమ్ముతున్నారని, దీని వెనుక పెద్ద దందా నడుస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి ఇప్పటికే 6.34 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కోటా చేరినట్లు ప్రభుత్వం చెబుతోందని, మరి ఆ నిల్వలు ఏమయ్యాయని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. రైతులకు అందాల్సిన యూరియాను అక్రమంగా గోదాములకు తరలించి, బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆమె దుయ్యబట్టారు.

రైతులు తెల్లవారుజాము నుంచే కిలోమీటర్ల మేర క్యూలలో నిలబడినా ఎరువులు దొరకడం లేదని, రైతు సేవా కేంద్రాల వద్ద 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయని షర్మిల తెలిపారు. వ్యవసాయ, విజిలెన్స్ శాఖలు ఈ అక్రమ రవాణాను ఎందుకు అడ్డుకోవడం లేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వానిది సాగుకు పెద్దపీట వేయడం కాదని, రైతు మెడపై కత్తిపీట పెట్టడమేనని ఆమె ఘాటుగా విమర్శించారు.

ఈ యూరియా సంక్షోభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. బ్లాక్ మార్కెట్ దందాను తక్షణమే అరికట్టి, ప్రైవేట్ వ్యాపారులపై విజిలెన్స్ దాడులు నిర్వహించాలని కోరారు. యూరియాను అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై నిత్యావసర వస్తువుల చట్టం (EC Act) కింద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్ సీజన్‌కు అదనంగా అవసరమైన 1.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను వెంటనే సొసైటీల ద్వారా రైతులకు సరఫరా చేసి ఆదుకోవాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
YS Sharmila
Andhra Pradesh
Urea shortage
Chandrababu Naidu
Farmers issues
AP Congress
Fertilizer crisis
Black market
Agriculture
Kharif season

More Telugu News