Mahesh Vitta: తండ్రి అయిన టాలీవుడ్ కమెడియన్ మహేశ్ విట్టా

Comedian Mahesh Vitta and Sravani Reddy Welcome Son
  • మగబిడ్డకు జన్మనిచ్చిన ఆయన భార్య శ్రావణి రెడ్డి
  • ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆనందాన్ని పంచుకున్న నటుడు
  • మహేశ్ దంపతులకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
టాలీవుడ్ కమెడియన్, బిగ్ బాస్ ఫేమ్ మహేశ్ విట్టా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఆయన తండ్రిగా ప్రమోషన్ పొందారు. మహేశ్ భార్య శ్రావణి రెడ్డి తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన వార్తను మహేశ్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన బిడ్డ ఫొటోలను షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యూట్యూబ్ వీడియోలతో కెరీర్ ప్రారంభించిన మహేశ్ విట్టా, తనదైన కామెడీ టైమింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో రెండుసార్లు పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ముఖ్యంగా బిగ్ బాస్ షో వేదికగానే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. తాను శ్రావణి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని ప్రకటించి, అదే ఏడాది ఆమెను వివాహం చేసుకున్నారు.

కొంతకాలంగా ఈ జంట తమ జీవితంలోని ప్రతి సంతోషకరమైన క్షణాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. రెండు నెలల క్రితం శ్రావణి గర్భవతి అనే విషయాన్ని ప్రకటించగా, గత నెలలో ఘనంగా నిర్వహించిన శ్రీమంతం వేడుక ఫోటోలను కూడా షేర్ చేశారు. ఇప్పుడు తమ కుటుంబంలోకి చిన్నారి అడుగుపెట్టడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ వార్త తెలియగానే నెటిజన్లు, అభిమానులు మహేశ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సినిమాల విషయానికొస్తే, మహేష్ విట్టా గతంలో 'జాంబిరెడ్డి', 'కొండపొలం' వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించనప్పటికీ, కొన్ని వెబ్ సిరీస్‌లలో నటిస్తూనే దర్శకుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 
Mahesh Vitta
Mahesh Vitta baby
Tollywood comedian
Bigg Boss Telugu
Sravani Reddy
Telugu cinema
Telugu actors
Zombie Reddy
Konda Polam

More Telugu News