Etela Rajender: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

Etela Rajender Meets Minister Ponguleti Regarding Housing
  • కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రావాలని బీజేపీ ఎంపీలుగా తాము కోరుకుంటున్నామని వెల్లడి
  • యూరియా సమస్య కూడా పరిష్కారం కావాలని ఆశిస్తున్నామన్న ఈటల రాజేందర్
  • రాష్ట్ర మంత్రులు బాధ్యతగా ఉండాలని సూచన
తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ కలిశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు అంశంపై ఆయన మంత్రిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణకు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రావాలని బీజేపీ ఎంపీలుగా తాము కూడా కోరుకుంటామని అన్నారు.

బీజేపీ ఎంపీలం అయినప్పటికీ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అవసరమైన అనుమతులు, నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. యూరియా సమస్య కూడా పరిష్కారం కావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర మంత్రులు బాధ్యతగా ఉండాలని, అనవసరంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయవద్దని కోరారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో తమను సంప్రదించలేదని ఈటల ఆరోపించారు. తమ దృష్టికి వచ్చిన కొందరు పేదల జాబితాను మంత్రికి ఇచ్చామని తెలిపారు. ఇందిరమ్మ పథకం కింద ఇంటి నిర్మాణం రూ. 5 లక్షలతో పూర్తయ్యే పరిస్థితి లేదని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కనీసం రూ. 12 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో వాటిలో దొంగలు పడుతున్నారని విమర్శించారు. జవహర్ నగర్‌లో మాజీ సైనికోద్యోగులకు సంబంధించిన భూముల్లో 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఇళ్లను కూల్చడం సరికాదని అన్నారు.
Etela Rajender
Ponguleti Srinivas Reddy
Telangana
BJP
Double Bedroom Houses
Indiramma Houses

More Telugu News