Sergio Gore: భారత్ కు అమెరికా కొత్త రాయబారి... గతంలో ఎలాన్ మస్క్ 'పాము' అని పిలిచింది ఇతడినే!

Sergio Gore Nominated as US Ambassador to India
  • భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్జియో గోర్ నామినేట్
  • గోర్ సెక్యూరిటీ క్లియరెన్స్‌పై అనుమానాలతో రాజుకున్న వివాదం
  • మస్క్, ట్రంప్ మధ్య దూరం పెంచడంలో గోర్ పాత్ర ఉందన్న ఆరోపణలు
  • ట్రంప్ ప్రభుత్వంలో కీలక నియామకాల అధికారిగా పనిచేసిన గోర్
  • మస్క్‌ను కీలక సమావేశాలకు దూరం పెట్టారంటూ మీడియా కథనాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సన్నిహిత సహాయకుల్లో ఒకరైన సెర్జియో గోర్‌ను భారత్‌కు తదుపరి రాయబారిగా నామినేట్ చేశారు. అయితే ఈ నియామకం సాధారణ రాజకీయ ప్రక్రియ కంటే ఎక్కువగా వివాదాలతో ముడిపడి ఉంది. ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్... సెర్జియో గోర్‌ను ఏకంగా 'పాము' అని సంబోధించడం గమనార్హం. ఈ వ్యాఖ్య వెనుక ట్రంప్ పరిపాలనలోని అంతర్గత విభేదాలు, అధికార పోరు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఎవరీ సెర్జియో గోర్?

మాల్టా నుంచి అమెరికాకు వలస వచ్చిన సెర్జియో గోర్, 1999లో అమెరికా పౌరసత్వం స్వీకరించారు. రిపబ్లికన్ పార్టీలో చేరి రాజకీయంగా వేగంగా ఎదిగారు. 2020లో ట్రంప్ ఎన్నికల ప్రచార బృందంలో చేరి నిధుల సేకరణలో ముఖ్య పాత్ర పోషించారు. అనంతరం వైట్‌హౌస్‌లో ఏకంగా 4,000 మంది ఫెడరల్ ఉద్యోగుల నియామకాలను పర్యవేక్షించే 'ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్' డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు.

మస్క్‌తో వివాదం ఏమిటి?

ఈ ఏడాది జూన్‌లో న్యూయార్క్ పోస్ట్ పత్రిక ప్రచురించిన ఒక కథనమే ఈ వివాదానికి మూలం. గోర్‌కు సంబంధించిన శాశ్వత భద్రతా క్లియరెన్స్ పత్రాలు ఇంకా పూర్తి కాలేదని ఆ కథనం పేర్కొంది. వైట్‌హౌస్ ఈ వార్తను ఖండించినప్పటికీ, ఎలాన్ మస్క్ ఆ కథనాన్ని షేర్ చేస్తూ గోర్‌ను 'పాము లాంటోడు' అని తీవ్రంగా విమర్శించారు.

ఈ వివాదం కేవలం సెక్యూరిటీ క్లియరెన్స్‌కు మాత్రమే పరిమితం కాలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ ప్రభావం పెరుగుతున్న సమయంలో, గోర్ తెరవెనుక చక్రం తిప్పినట్లు ఆరోపణలున్నాయి. మస్క్‌ను కీలక సమావేశాలకు రాకుండా అడ్డుకోవడం, ఆయన మిత్రుడైన జారెడ్ ఐసాక్‌మన్‌ గతంలో డెమోక్రాట్లకు విరాళాలు ఇచ్చారంటూ ట్రంప్‌కు తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి చర్యలతో మస్క్, ట్రంప్ మధ్య అపనమ్మకాన్ని సృష్టించారని సమాచారం. ఈ పరిణామాలే చివరకు మస్క్ తన పదవికి రాజీనామా చేయడానికి, ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి దారితీశాయి. ఇప్పుడు అదే సెర్జియో గోర్‌ను భారత్ వంటి వ్యూహాత్మక దేశానికి రాయబారిగా ట్రంప్ నామినేట్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Sergio Gore
US Ambassador to India
Donald Trump
Elon Musk
India US relations
Presidential Personnel Office
Trump administration
Malta
Jared Isaacman
US politics

More Telugu News