Kishan Reddy: కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలి: కిషన్ రెడ్డి డిమాండ్

Kishan Reddy Demands CBI Probe into Kaleshwaram Project
  • కాళేశ్వరంపై కమిషన్ నివేదిక ప్రకారం సీబీఐ విచారణ జరపాలన్న కిషన్ రెడ్డి
  • హైదరాబాద్‌లో 4 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆరోపణ
  • రాష్ట్రానికి మరో 50 వేల టన్నుల యూరియా సరఫరాకు హామీ
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూస్తామని ఆయన అన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్‌లో దాదాపు 4 లక్షల డబుల్ ఓట్లు ఉన్నాయని, రాష్ట్రంలో ఓటర్ల జాబితాను సమగ్రంగా సవరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తాము ఓట్ల చోరీకి పాల్పడితే లోక్‌సభలో తమ పార్టీ సీట్లు ఎందుకు తగ్గాయని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రానికి యూరియా సరఫరా అంశంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనతో ఫోన్‌లో మాట్లాడారని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు అదనంగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కోరారని, రాష్ట్రానికి రావాల్సిన వాటాను తప్పకుండా పంపిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సాంకేతిక కారణాల వల్ల రామగుండం ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయిందని ఆయన వివరించారు.

పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పందిస్తూ, ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ దొందూ దొందేనని విమర్శించారు. బీజేపీలోకి ఎవరైనా రావాలనుకుంటే, తమ పదవులకు రాజీనామా చేసి రావాలని ఆయన స్పష్టం చేశారు. మొయినాబాద్ ఫాం హౌస్ కేసుతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మరోసారి తేల్చి చెప్పారు.

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై మాట్లాడుతూ, మెట్రో ప్రస్తుతం నష్టాల్లో నడుస్తోందని, దీంతో కొత్త లైన్ల నిర్మాణానికి ఎల్ అండ్ డీ సంస్థ సుముఖంగా లేదని అన్నారు. అయితే, మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. బీహార్‌లో బీజేపీ తప్పకుండా అధికారం చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Kishan Reddy
Kaleshwaram project
CBI investigation
Telangana
Double votes
Urea supply
Metro rail
PC Ghosh Commission
Ramagundam factory
Party defections

More Telugu News