Pushkar Singh Dhami: ఉత్తరాఖండ్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. చమోలీలో జల విలయం.. బాలిక మృతి

Uttarakhand Chamoli Cloudburst Girl Dead One Missing
  • ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో విరుచుకుపడిన మేఘ విస్ఫోటనం
  • భారీ వరదలతో సర్వం జలమయం, బురదలో కూరుకుపోయిన ఇళ్లు
  • శిథిలాల కింద చిక్కుకుని ఓ బాలిక మృతి చెందినట్లు అనుమానం
  • మరొక వ్యక్తి గల్లంతు.. ముమ్మరంగా సహాయక చర్యలు
  • కొట్టుకుపోయిన వాహనాలు.. రోడ్లు మూసుకుపోయి తీవ్ర నష్టం
  • పరిస్థితిని పర్యవేక్షిస్తున్న సీఎం పుష్కర్ సింగ్ ధామి
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో గత రాత్రి మేఘ విస్ఫోటనం (క్లౌడ్ బరస్ట్) పెను విషాదాన్ని నింపింది. ఆకస్మిక వరదలు, భారీగా కొట్టుకొచ్చిన బురద, శిథిలాల కారణంగా జిల్లా అతలాకుతలమైంది. ఈ ఘటనలో ఓ బాలిక శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందినట్టు అనుమానిస్తుండగా, మరొక వ్యక్తి గల్లంతయ్యాడు.

చమోలీ జిల్లాలోని థరాలీ ప్రాంతంలో ఈ విపత్తు సంభవించింది. భారీ వర్షం కారణంగా థరాలీ మార్కెట్, కోట్‌దీప్, తహసీల్ కాంప్లెక్స్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లు, ఎస్డీఎం నివాసంతో పాటు అనేక భవనాల్లోకి బురద నీరు పోటెత్తింది. తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నిలిపి ఉంచిన అనేక వాహనాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. పట్టణంలోని వీధులన్నీ చెరువులను తలపించాయి.

సమీపంలోని సగ్వారా గ్రామంలో ఓ బాలిక శిథిలాల కింద చిక్కుకుపోవడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వరద ఉద్ధృతికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చెప్డాన్ మార్కెట్‌లోనూ కొన్ని దుకాణాలు దెబ్బతిన్నాయి. ఇక్కడే మరొక వ్యక్తి గల్లంతైనట్టు సమాచారం.

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. “చమోలీ జిల్లా థరాలీ ప్రాంతంలో మేఘ విస్ఫోటనం గురించి విషాదకరమైన వార్త అందింది. జిల్లా యంత్రాంగం, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నేను అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాను. అందరూ క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. 
Pushkar Singh Dhami
Uttarakhand cloudburst
Chamoli cloudburst
cloudburst India
Uttarakhand floods
Chamoli floods
India natural disaster
Tharali
SDRF
Uttarakhand news

More Telugu News