Mohammad Khaja: బ్లేడ్లు మింగిన ఆటోడ్రైవర్.. ఆపరేషన్ లేకుండా బయటకు తీసిన ‘గాంధీ’ వైద్యులు

Gandhi Hospital Doctors Remove Blades From Mans Stomach Without Surgery
  • కుటుంబ కలహాలతో 8 షేవింగ్ బ్లేడ్లు మింగిన ఆటో డ్రైవర్
  • గాంధీ ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు
  • ఆపరేషన్ లేకుండానే చికిత్స చేయాలని వైద్యుల నిర్ణయం
  • ప్రత్యేక వైద్య ప్రక్రియతో మలం ద్వారా బయటకు వచ్చిన 16 బ్లేడ్ ముక్కలు
  • మూడు రోజుల చికిత్సతో పూర్తిగా కోలుకున్న బాధితుడు
  • విజయవంతంగా చికిత్స పూర్తి చేసి డిశ్చార్జ్ చేసిన వైద్యులు
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశంలో 8 షేవింగ్ బ్లేడ్లను ముక్కలు చేసి మింగేసిన ఓ వ్యక్తికి ఎలాంటి శస్త్రచికిత్స చేయకుండానే వైద్యులు తొలగించారు. అత్యంత క్లిష్టమైన ఈ కేసులో వైద్యులు తమ నైపుణ్యంతో మూడు రోజుల్లోనే కడుపులోని 16 పదునైన బ్లేడ్ ముక్కలను సురక్షితంగా బయటకు రప్పించారు.

మౌలాలీ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ ఖాజా (37)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 16న కుటుంబంలో జరిగిన గొడవతో ఆవేశానికి లోనైన ఖాజా 8 షేవింగ్ బ్లేడ్లను రెండేసి ముక్కలుగా చేసి మింగేశాడు. కాసేపటికే కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో తాను బతకనంటూ ఏడవటం మొదలుపెట్టాడు. భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

జనరల్ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ సునీల్ కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం వెంటనే స్పందించి ఎక్స్‌రే, సీటీ స్కాన్ తీసింది. ఖాజా పొట్టలో బ్లేడ్ ముక్కలు ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. తొలుత ఎండోస్కోపీ ద్వారా వాటిని తీయాలని భావించినా, ఆ ప్రక్రియలో అన్నవాహిక, ఇతర అవయవాలకు గాయాలై రక్తస్రావం జరిగే ప్రమాదం ఉందని గుర్తించారు. దీంతో శస్త్రచికిత్స లేకుండానే, ప్రత్యామ్నాయ మార్గంలో చికిత్స అందించాలని నిర్ణయించారు.

వైద్యులు ‘ప్రోటాన్ పంప్’ అనే ప్రత్యేక వైద్య ప్రక్రియను ఎంచుకున్నారు. ఖాజాకు ఆహారం, నీరు పూర్తిగా నిలిపివేసి, ఇంట్రావీనస్ (ఐవీ) ద్వారా ద్రవాలను ఎక్కించారు. ఈ విధానం ద్వారా బ్లేడ్ ముక్కలు నెమ్మదిగా కదులుతూ మల విసర్జన ద్వారా బయటకు వచ్చేలా చేశారు. మూడు రోజుల పాటు సాగిన ఈ చికిత్సలో, బ్లేడ్ ముక్కలన్నీ పూర్తిగా బయటకు వచ్చేశాయి. అనంతరం మరోసారి ఎక్స్‌రే తీసి కడుపులో ఎలాంటి ముక్కలూ లేవని నిర్ధారించుకున్నాక వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు.

బాధితుడు పూర్తిగా కోలుకోవడంతో ఈ నెల 21న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని, ఆసుపత్రి అడిషనల్ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ నిన్న మీడియాకు వెల్లడించారు. అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్న రోగి ప్రాణాలను శస్త్రచికిత్స లేకుండా కాపాడిన గాంధీ వైద్యుల బృందాన్ని పలువురు అభినందించారు.
Mohammad Khaja
Gandhi Hospital
blade swallowing
stomach blades
proton pump
medical procedure
family disputes
Secunderabad hospital
suicide attempt
foreign body ingestion

More Telugu News