Sergio Gore: ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్‌కు కొత్త అమెరికా రాయబారి నియామ‌కం

Sergio Gore Appointed as New US Ambassador to India by Trump
  • భారత్‌కు కొత్త అమెరికా రాయబారిగా సెర్గియో గోర్
  • నియామకాన్ని అధికారికంగా ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
  • తన గొప్ప స్నేహితుడని సెర్గియోను అభివర్ణించిన ట్రంప్
  • దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక రాయ‌బారిగా అదనపు బాధ్యతలు
  • వాణిజ్య ఉద్రిక్తతల నడుమ ప్రాధాన్యం సంతరించుకున్న నియామకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌కు తదుపరి అమెరికా రాయబారిగా తన ఆప్తమిత్రుడు, వైట్‌హౌస్ పర్సనల్ ఆఫీస్ డైరెక్టర్ సెర్గియో గోర్‌ను నియమిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈయనకు అదనంగా దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక రాయ‌బారిగా కూడా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలలో ఒక కొత్త అధ్యాయం మొదలుకానుంది.

ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా వెల్లడించారు. భారత్‌లో మా తదుపరి రాయబారిగా సెర్గియో గోర్‌ను నియ‌మిస్తున్నట్లు ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు. సెర్గియో, ఆయన బృందం రికార్డు సమయంలో దాదాపు 4,000 మంది త‌మ‌ను తాము దేశభక్తులుగా భావించుకునే వారిని ప్రభుత్వంలోని అన్ని విభాగాలలో నియమించారని ట్రంప్ ప్రశంసించారు. ప్రస్తుతం మా ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీల్లో 95 శాతం పైగా ఉద్యోగుల‌తో నిండిపోయాయని తెలిపారు.

సెర్గియో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ, బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల ప్రచురణలోనూ, ట్రంప్ అనుకూల సూపర్ పీఏసీని నడపడంలోనూ కీలక పాత్ర పోషించారని ట్రంప్ గుర్తుచేశారు. ఆయన నియామకం సెనేట్‌లో ఖరారయ్యే వరకు ప్రస్తుత పదవిలో కొనసాగుతారని స్పష్టం చేశారు.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న ప్రాంతానికి తన ఎజెండాను ముందుకు తీసుకెళ్లగల పూర్తి నమ్మకస్తుడైన వ్యక్తి అవసరమని ట్రంప్ అన్నారు. "సెర్గియో ఒక అద్భుతమైన రాయబారి అవుతారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లక్ష్యానికి ఆయన ఎంతగానో సాయపడతారు. సెర్గియోకు అభినందనలు" అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, రష్యాతో వాణిజ్య సంబంధాల కారణంగా అమెరికా భారత్‌పై 25 శాతం పరస్పర సుంకాలతో పాటు అదనపు టారిఫ్‌లు విధించిన సున్నితమైన తరుణంలో ఈ నియామకం జరగడం గమనార్హం.
Sergio Gore
India
Donald Trump
US Ambassador to India
South Asia
Central Asia
US-India relations
Trump administration
Trade tariffs
Truth Social

More Telugu News