Ranil Wickremesinghe: శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే అరెస్టు

Ranil Wickremesinghe Arrested on Corruption Charges
  • ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో చర్యలు
  • వ్యక్తిగత లండన్ పర్యటనపై సీఐడీ విచారణ
  • అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిధులు వాడారన్న ఆరోపణలు
  • కొలంబో ఫోర్ట్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్న పోలీసులు
  • ఆర్థిక సంక్షోభం తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రణిల్
శ్రీలంక రాజకీయాల్లో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ మాజీ అధ్యక్షుడు, ఆరుసార్లు ప్రధానిగా పనిచేసిన రణిల్ విక్రమసింఘేను పోలీసులు అరెస్ట్ చేశారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వ్యక్తిగత విదేశీ పర్యటన కోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఈ అరెస్ట్ జరిగింది.

వివరాల్లోకి వెళితే, 2023 సెప్టెంబర్‌లో రణిల్ విక్రమసింఘే లండన్‌లో పర్యటించారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనప్పటికీ, దానికైన ఖర్చులను ప్రభుత్వ నిధుల నుంచి చెల్లించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అప్పుడు తన భార్యతో కలిసి ఓ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొన్నారు. ఆ విదేశీ పర్యటన అధికారికంగా చేపట్టింది కాదని ఆయన ఆ తర్వాత తెలిపారు.

అయితే దానికి ప్రభుత్వ నిధులను వినియోగించారని ఆరోపణలు ఉన్నాయి. హవానాలో జీ-77 సదస్సులో హాజరై తిరిగి వస్తూ లండన్‌కు వెళ్లినప్పుడు తన భార్య ఖర్చులను ఆమెనే భరించారని, ప్రభుత్వ నిధులు వినియోగించలేదని విక్రమ్‌సింఘే వాదిస్తున్నారు. కానీ ఈ పర్యటనలో ప్రభుత్వ సొమ్ము వాడారని, అంగరక్షకులకు కూడా చెల్లింపులు చేశారని విచారణ అధికారులు చెబుతున్నారు.

ఈ కేసుకు సంబంధించి శ్రీలంక పోలీసుల నేర పరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు శుక్రవారం ఉదయం ఆయన్ను విచారించారు. విచారణ ముగిసిన వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ఓ ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు.

అరెస్ట్ చేసిన రణిల్ విక్రమసింఘేను కొలంబో ఫోర్ట్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు, ప్రజాగ్రహంతో నాటి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పదవి నుంచి వైదొలగడంతో 2022 జూలైలో జరిగిన పార్లమెంటరీ ఓటింగ్‌లో రణిల్ విక్రమసింఘే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన అవినీతి ఆరోపణలపై అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Ranil Wickremesinghe
Sri Lanka
Sri Lanka political crisis
G77 summit
Gotabaya Rajapaksa

More Telugu News