Ram Gopal Varma: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశాల సవరణ... తీవ్రంగా స్పందించిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma Reacts to Supreme Courts Order on Stray Dogs
  • వీధికుక్కలపై సుప్రీంకోర్టు తీర్పును ప్రశ్నించిన ఆర్జీవీ
  • వ్యాక్సిన్ వేస్తే కుక్కలు కరవకుండా ఉంటాయా అని నిలదీత
  • దూకుడుగా ఉండే కుక్కలను ఎలా గుర్తిస్తారని ప్రశ్న
  • వాటికి ఆహారం పెట్టే ప్రాంతాల గురించి కుక్కలకు ఎలా తెలుస్తుంది?
  • కుక్కల కోసం ప్రత్యేకంగా 'డాగ్ పోలీస్' పెడతారా అంటూ సెటైర్
  • తీర్పులో కుక్కకాటు బాధితుల ప్రస్తావన లేకపోవడంపై ఆవేదన
 తనదైన శైలిలో మరోసారి వార్తల్లో నిలిచారు. వీధికుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు ఇటీవల జారీ చేసిన ఆదేశాలను తాజాగా సవరించడం తెలిసిందే. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ తీర్పు ఆచరణ సాధ్యమేనా అని ప్రశ్నిస్తూ, పలు కీలకమైన, పదునైన ప్రశ్నలను లేవనెత్తారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన సంధించిన ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలను ప్రస్తావిస్తూ వర్మ అడిగిన ప్రశ్నలు ఆయన మాటల్లోనే..

1. వ్యాక్సినేషన్‌, డీవార్మింగ్‌పై:

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కుక్కలకు వ్యాక్సిన్లు, నులిపురుగుల మందులు ఇచ్చి, వాటిని పట్టుకున్న ప్రాంతంలోనే తిరిగి వదిలేయాలి. నా ప్రశ్నలు ఇవే:

* ఒక కుక్క వ్యాక్సిన్ సర్టిఫికెట్, వీధిలో ఆడుకుంటున్న పిల్లాడిని కాటు వేయకుండా ఎలా కాపాడుతుంది? కరవాలా వద్దా అని నిర్ణయించుకునే ముందు కుక్కలు తమ మెడికల్ ఫైల్ చదువుకోవాలా?
* రేబిస్ ఇంజెక్షన్ ఇవ్వగానే కుక్కలకు ఆకలి, వేటాడే స్వభావం ఒక్కసారిగా ఆగిపోతాయా?
* నులిపురుగుల నివారణే పరిష్కారమైతే, ఇన్నేళ్లుగా పిల్లలపై జరిగిన దాడులకు, మరణాలకు ఆ పురుగులే కారణమా?

2. దూకుడు స్వభావం ఉన్న కుక్కలపై:

రేబిస్ సోకిన లేదా దూకుడుగా ప్రవర్తించే కుక్కలను తిరిగి వదిలిపెట్టకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. దీనిపై నా సందేహాలు:

* దేశంలో ఉన్న కోట్ల వీధికుక్కలకు రేబిస్ పరీక్షలు చేసేందుకు మన దగ్గర తగినన్ని వసతులు, సిబ్బంది, నిధులు ఉన్నాయా?
* ప్రతి కుక్క మానసిక ఆరోగ్యాన్ని ఎవరు పర్యవేక్షిస్తారు? వాటి కోసం సైకియాట్రిస్టులను ఏర్పాటు చేస్తారా?
* కుక్కల దూకుడును కొలిచేందుకు ఏదైనా పరికరం కనిపెడతారా? ఏ కుక్క ఎంత దూకుడుగా ఉందో ఎవరు, ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు? దీనికోసం ఒక కమిటీ వేస్తారా? లేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తారా?
* ఒక కుక్క ఒక క్షణం దాడి చేసి, మరుక్షణమే తోక ఊపితే దాన్ని దూకుడుగా పరిగణించాలా లేక స్నేహంగా ఉన్నట్టు భావించాలా? న్యాయవాదులు, శునక ప్రేమికులు, వెటర్నరీ డాక్టర్లు, డాగ్ సైకియాట్రిస్టులు కలిసి ప్రతి కుక్క మూడ్ స్వింగ్స్‌పై చర్చిస్తారా?

3. ఆహారం అందించే ప్రదేశాలపై:

ప్రజా పరిసరాల్లో కుక్కలకు ఆహారం పెట్టడం నిషేధం, కేవలం నిర్దేశిత ప్రాంతాల్లోనే పెట్టాలి అని కోర్టు చెప్పింది. మరి నా ప్రశ్నలు:

* ఈ "నిర్దేశిత ప్రాంతాలను" ఎవరు, దేని ఆధారంగా నిర్ణయిస్తారు?
* ఆ ప్రాంతాల గురించి వీధికుక్కలకు ఎలా తెలుస్తుంది? వాటికి దారి చూపించడానికి కుక్కల కోసం ప్రత్యేకంగా గూగుల్ మ్యాప్స్ ఏమైనా తయారు చేస్తారా?
* వేలాది నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని ఏ శాఖ పర్యవేక్షిస్తుంది? మున్సిపల్ అధికారులా? పోలీసులా? లేక కొత్తగా "డాగ్ పోలీస్" అనే విభాగాన్ని స్థాపిస్తారా?

నా చివరి ప్రశ్న:

"ఈ తీర్పులో కుక్కకాటు బాధితులు, ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన పిల్లల గురించి ఎక్కడా ప్రస్తావన ఎందుకు లేదు? తుది తీర్పు ఇచ్చే ముందు గౌరవనీయ సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను" అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.
Ram Gopal Varma
Supreme Court
stray dogs
dog bite
rabies
animal rights
dog control
India
RGV
court order

More Telugu News