PUBG: నిర్మల్‌లో తీవ్ర విషాదం.. పబ్జీ గేమ్ కోసం ప్రాణాలు తీసుకున్న బాలుడు

Telangana Teen Takes Life Due to PUBG Addiction
  • పబ్జీ గేమ్‌కు బానిసైన పదో తరగతి విద్యార్థి
  • ఫోన్ లాక్కోవడంతో మనస్తాపం
  • ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య
  • రోజుకు 10 గంటలకు పైగా గేమ్ ఆడుతున్న బాలుడు
  • డాక్టర్లకు చూపించినా ప్రవర్తనలో రాని మార్పు
ఆన్‌లైన్ గేమ్ వ్యసనం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రముఖ ఆన్‌లైన్ గేమ్ పబ్జీ ఆడనివ్వలేదన్న కారణంతో ఓ విద్యార్థి ప్రాణం తీసుకున్న విషాద ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో నిన్న చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బేతి రిషేంద్ర అనే పదో తరగతి విద్యార్థి పబ్జీ గేమ్‌కు బానిసయ్యాడు. రోజూ 10 గంటలకు పైగా ఆటలోనే మునిగిపోతూ చదువును పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. గేమ్ ఆడేందుకు సమయం సరిపోవడం లేదంటూ స్కూల్‌కు వెళ్లడం కూడా మానేశాడు. కొడుకు భవిష్యత్తుపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు అతడిని ఓ మానసిక వైద్యుడితో పాటు న్యూరోసర్జన్ వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించారు.

అయినా రిషేంద్ర ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా, చికిత్స అందిస్తున్న వైద్యుడినే బెదిరించినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విసిగిపోయిన వారు మూడు రోజుల క్రితం రిషేంద్ర నుంచి ఫోన్‌ను బలవంతంగా తీసేసుకున్నారు. గేమ్ ఆడలేకపోతున్నాననే మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో రిషేంద్ర ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పబ్జీ వ్యసనం కారణంగా ఇలాంటి విషాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బీహార్‌లో రైలు పట్టాలపై గేమ్ ఆడుతూ ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోగా, హైదరాబాద్‌లో ఓ క్యాబ్ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూనే పబ్జీ ఆడుతున్న వీడియో సంచలనం సృష్టించింది. తాజా ఘటనతో ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం యువతపై ఎంతటి తీవ్ర ప్రభావం చూపుతోందో మరోసారి స్పష్టమైంది.
PUBG
PUBG addiction
Nirmal district
Online gaming addiction
Student suicide
Telangana news
Online games
Mental health
Teenage suicide

More Telugu News