Chandrababu: కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Chandrababu Reviews Flood Situation in Krishna Godavari Rivers
  • అప్రమత్తంగా ఉండాలని అధికారులకు చంద్ర‌బాబు ఆదేశాలు 
  • ఎరువుల లభ్యత, సరఫరా, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించిన సీఎం
  • కాకినాడ సమీపంలో గ్యాస్ లీక్ ఘటనపై ఆరా తీసిన ముఖ్యమంత్రి
  • ఢిల్లీ నుంచి సీఎస్, డీజీపీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ
గోదావరి, కృష్ణా నదులకు ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు, వరదల పరిస్థితిపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ నుంచి సీఎస్ కె.విజయానంద్, డీజీపీ హరీశ్‌ కుమార్ గుప్తాలతో పాటు ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా తాజా పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. 

రెండు నదులకు వస్తున్న వరద ప్రవాహాలు, పలు ప్రాంతాల్లో నీట మునిగిన పంటలు, నివాస సముదాయాలకు సంబంధించి అధికారులు సీఎంకు వివరించారు. కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో శ్రీశైలం నుంచి 5.20 లక్షలు, నాగార్జున సాగర్ నుంచి 4.32 లక్షలు, పులిచింతల నుంచి 4.07 లక్షలు, ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.53 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

గోదావరి నదిలోనూ భారీగానే వరద ప్రవాహం వస్తోందని, ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 13,42,307 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోందని సీఎంకు వివరించారు. గోదావరి వరదల కారణంగా పరీవాహక ప్రాంతంలోని లంక గ్రామాలు, పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు వివరించారు. ఈ ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగం సమస్య వచ్చిన తరువాత స్పందించటం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందుగానే సన్నద్ధతతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. వరదలు, భారీ వర్షాలపై ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు నిరంతరం క‌చ్చితమైన సమాచారం ఇచ్చి...తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా చూడాలని చెప్పారు.  

ఎరువుల కొరత లేకుండా చర్యలు
రాష్ట్రంలో ఎరువులు, పురుగుమందుల లభ్యత, సరఫరా అంశంపైనా సీఎం సమీక్ష చేశారు. ఎరువుల కొరత అనే సమస్య లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలని సూచించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, దారి మళ్లించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజిలెన్స్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ఎరువులు దారి మళ్లకుండా, ధర పెరగకుండా చూడాలని సీఎం సూచించారు. ఎరువుల కొరత అనే సమస్య ఉన్నట్లు ఎక్కడ నుంచి సమాచారం వచ్చినా, రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. 

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ధరియాల తిప్ప సమీపంలో సముద్రంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లీక్ ఘటన పైనా సీఎం అధికారులతో మాట్లాడారు. రాత్రి 1.30 గంటలకు గ్యాస్ లీక్ తో మంటలు భారీగా ఎగిసి పడ్డాయని గంటన్నర వ్యవధిలోనే గ్యాస్ సరఫరా నిలిపివేసి లీక్ ను అరికట్టారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. లీక్ అయిన పైప్ ను మొత్తం తనిఖీ చేసి సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Chandrababu
Krishna River
Godavari River
Andhra Pradesh Floods
Srisailam
Nagarjuna Sagar
Polavaram Project
Fertilizer Shortage
ONGC Gas Leak
Dharia Thippa

More Telugu News