DK Shivakumar: కర్ణాటక అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం.. ఆర్ఎస్ఎస్ గీతం పాడిన డీకే శివకుమార్

DK Shivakumar Sings RSS Anthem In Karnataka Assembly Then Clarifies
  • బీజేపీ నేతల విమర్శలకు సరదాగా స్పందిస్తూ ఆర్ఎస్ఎస్ గీతాన్ని పాడిన డీకే
  • ఈ ఘటనను అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురుదాడి
  • ప్రధాని మోదీ ప్రసంగాన్ని విమర్శించిన కాంగ్రెస్‌కు ఇదే సమాధానమన్న బీజేపీ
  • తాను జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేసిన డీకే శివకుమార్
కర్ణాటక రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అసెంబ్లీలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గీతాన్ని ఆలపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఊహించని చర్యతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడగా, బీజేపీకి ఓ కొత్త రాజకీయ అస్త్రం దొరికినట్టయింది.

అసలేం జరిగిందంటే?
 ఆమధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై గురువారం కర్ణాటక విధానసభలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత ఆర్. అశోక మాట్లాడుతూ... డీకే శివకుమార్ ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ నిక్కర్ (గతంలోని యూనిఫాం) ధరించారని వ్యాఖ్యానించారు. దీనికి సరదాగా స్పందించిన డీకే శివకుమార్, తన స్థానం నుంచి లేచి ఆర్ఎస్ఎస్ గీతమైన "నమస్తే సదా వత్సలే మాతృభూమి"ని పాడటం ప్రారంభించారు. దీంతో సభలో ఒక్కసారిగా ఆసక్తికర వాతావరణం నెలకొంది.

బీజేపీ ఎదురుదాడి
ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో బీజేపీ వెంటనే కాంగ్రెస్‌పై విమర్శల దాడిని ప్రారంభించింది. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ గురించి ప్రస్తావించడాన్ని తప్పుబట్టిన కాంగ్రెస్ నేతలే ఇప్పుడు ఆ సంస్థ గీతాలు పాడుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఎద్దేవా చేశారు. "డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతం పాడటంతో రాహుల్ గాంధీ, ఆయన బృందం షాక్‌కు గురై ఉంటారు. కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు అనడానికి ఇదే నిదర్శనం" అని ఆయన ఎక్స్ (ట్విట్టర్‌)లో పేర్కొన్నారు.

డీకే శివకుమార్ వివరణ
ఈ వివాదంపై డీకే శివకుమార్ స్పందించారు. తాను పుట్టుకతో కాంగ్రెస్ వాడినని, జీవితాంతం అదే పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. "ఒక నాయకుడిగా నాకు మిత్రులెవరో, శత్రువులెవరో తెలిసి ఉండాలి. అందుకే నేను వారి గురించి కూడా అధ్యయనం చేశాను. బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదు" అని ఆయన తేల్చిచెప్పారు. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పే క్రమంలోనే సరదాగా అలా పాడానని, దానికి రాజకీయ రంగు పులమవద్దని ఆయన సూచించారు. ఏదేమైనా, ఈ ఘటన కర్ణాటక రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.
DK Shivakumar
Karnataka politics
RSS song
Namaste Sada Vatsale Matrubhume
Karnataka Assembly
Congress party
BJP criticism
Pradeep Bhandari
R Ashok

More Telugu News