Bandi Sanjay: హౌసింగ్ సొసైటీల ఇళ్ల స్థలాలపై సుప్రీంకోర్టులో చుక్కెదురు.. రివ్యూ పిటిషన్ల కొట్టివేత

Supreme Court Dismisses Review Petitions on Journalists House Sites in Telangana
  • తెలంగాణలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు కొట్టివేత
  • గత తీర్పును సమీక్షించడానికి సరైన కారణాలు లేవని స్పష్టం చేసిన ధర్మాసనం
  • ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులకు నిరాశ
  • సుప్రీం తీర్పుపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
  • బీజేపీ అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి అని విమర్శ
తెలంగాణలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారంలో సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇళ్ల స్థలాల కేటాయింపును రద్దు చేస్తూ గతంలో తాము ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తీర్పును సమీక్షించడానికి తగిన కారణాలేవీ కనిపించడం లేదని స్పష్టం చేసింది.

జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ పిటిషన్లను విచారించింది. కరుణ, సమానత్వంతో ఆలోచించి తీర్పు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. కోర్టు నిర్ధారించిన మార్కెట్ ధర చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తక్కువ జీతాలు, పెన్షన్ ప్రయోజనాలు లేని జర్నలిస్టులను ఇతరులతో సమానంగా చూడటం సరికాదని జర్నలిస్టుల తరఫు న్యాయవాది వాదించారు. అయితే, ఈ వాదనలను పరిగణనలోకి తీసుకోని ధర్మాసనం, రివ్యూ చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెబుతూ పిటిషన్లను తోసిపుచ్చింది.

గతేడాది నవంబర్ 25న నాటి భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించిన జీవోను కొట్టివేసిన విషయం తెలిసిందే. 2010లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపి సుప్రీంకోర్టు ఆ తీర్పును వెలువరించింది. దీనిపైనే తాజాగా రివ్యూ పిటిషన్లు దాఖలు చేయగా, వాటిని కోర్టు తిరస్కరించింది.

మేం ఇళ్లు కట్టిస్తాం: బండి సంజయ్ భరోసా
సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. జర్నలిస్టులెవరూ అధైర్యపడొద్దని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయ నిపుణులతో చర్చించి అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అవకాశవాద రాజకీయాల వల్లే జర్నలిస్టులకు ఈ దుస్థితి ఎదురైందని ఆయన విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, లేనిపక్షంలో ఆ బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Bandi Sanjay
Telangana journalists
house sites
Supreme Court
review petition
Bandi Sanjay comments
journalists housing scheme
real estate
Telangana news
BJP promise

More Telugu News