Rahul Gandhi: రాహుల్ గాంధీ డ్రైవర్ పై ఎఫ్ఐఆర్ నమోదు... కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

Rahul Gandhi Driver FIR Filed Sparks Congress BJP Clash
  • బీహార్‌లో రాహుల్ గాంధీ 'ఓటర్ అధికార్ యాత్ర'లో అపశ్రుతి
  • కాన్వాయ్ వాహనం తగిలి పోలీసు కానిస్టేబుల్‌కు గాయాలు
  • రాహుల్ గాంధీ వాహన డ్రైవర్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు
  • ఈ ఘటనపై రాహుల్‌ను విమర్శించిన బీజేపీ నేత షెహజాద్ పూనావాలా
  • గాయపడిన కానిస్టేబుల్‌కు రాహుల్ గాంధీ పరామర్శ
బీహార్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'ఓటర్ అధికార్ యాత్ర'లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్‌లోని వాహనం తగిలి ఓ పోలీసు కానిస్టేబుల్ గాయపడగా, ఆ వాహన డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే రాహుల్ గాంధీ తన వాహనాన్ని ఆపి, గాయపడిన పోలీసుకి సహాయం చేశారు. ఈ ఘటన రాజకీయంగానూ కాక రేపింది.

వివరాల్లోకి వెళితే, నవాడా జిల్లాలోని భగత్ సింగ్ చౌక్ వద్ద రాహుల్ గాంధీ యాత్ర కొనసాగుతుండగా... ఈ క్రమంలో భద్రతా విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ అదుపుతప్పి కాన్వాయ్‌లోని వాహనం ముందు పడిపోయారు. దీంతో ఆ వాహనం ఆయన కాలిపై నుంచి వెళ్లడంతో గాయాలయ్యాయి. ఈ విషయంపై నవాడా ఎస్పీ అభినవ్ ధీమన్ స్పందిస్తూ, "డ్రైవర్‌పై కేసు నమోదు చేశాం. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాం" అని తెలిపారు.

ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా సోషల్ మీడియా వేదిక 'ఎక్స్‌'లో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ, "రాహుల్ గాంధీ కారు ఓ పోలీసును తీవ్రంగా గాయపరిచింది. కనీసం ఆగి చూడకుండా ఆయన వెళ్లిపోయారు" అని తీవ్ర విమర్శలు చేశారు.

అయితే, ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన మరో వీడియోలో వాస్తవ పరిస్థితి భిన్నంగా కనిపించింది. ప్రమాదం జరిగిన వెంటనే రాహుల్ గాంధీ తన వాహనాన్ని నిలిపివేశారు. కిందపడిన కానిస్టేబుల్‌ వద్దకు వెళ్లి, ఆయన్ను పైకి లేపి తన జీపులోకి ఎక్కించుకున్నారు. ఆయనకు మంచినీళ్లు అందించి, ఓదార్చిన తర్వాతే తన యాత్రను కొనసాగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ వర్గాలు కౌంటర్ ఇస్తున్నాయి. ఈ ఘటన ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.
Rahul Gandhi
Rahul Gandhi Bihar
Bihar Congress Yatra
Nawada accident
Police constable injured
BJP Congress clash
Shehzad Poonawalla
Bharat Jodo Yatra
Indian politics
Accident FIR

More Telugu News