Tumala Nageswara Rao: రాంచందర్‌రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారు: తుమ్మల నాగేశ్వరరావు

Tumala Nageswara Rao Slams Ramchander Rao on Urea Issue
  • తెలంగాణలో యూరియా కొరతకు కేంద్రమే పూర్తి కారణమన్న తుమ్మల
  • కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ఈ కుట్ర అని ఆరోపణ
  • సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదని మండిపాటు
తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు యూరియా సంక్షోభాన్ని సృష్టిస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణకు యూరియా కేటాయింపుల విషయంలో కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోందని తుమ్మల విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై గత కొన్ని నెలలుగా కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. సమస్య తీవ్రతను వివరించేందుకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరితే, ప్రధానమంత్రి మోదీ అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా యూరియా ఉత్పత్తి నిలిచిపోయిందని, తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర బీజేపీ నేతలపైనా తుమ్మల తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని అన్నారు. "బాధ్యతగల పదవిలో ఉన్న రాంచందర్‌రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఇలాంటి మూర్ఖపు మాటల వల్ల బీజేపీ ఎప్పటికీ బలపడదు" అని హితవు పలికారు. రైతులను అడ్డుపెట్టుకుని కొందరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, చచ్చిన పార్టీకి ప్రాణం పోయాలని ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఈ నెలాఖరులోగా రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటాను వెంటనే విడుదల చేయాలని తుమ్మల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూరియా సమస్యను కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని, ఇలాంటి వారి పట్ల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. 
Tumala Nageswara Rao
Telangana
Urea shortage
Central Government
Revanth Reddy
Kishan Reddy
BJP
Farmers
Agriculture
Ramchander Rao

More Telugu News